Maha Kumbh | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) జనవరి 26న శివరాత్రి సందర్భంగా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరుకాకపోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
రాహుల్‌తోపాటు శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) కూడా మహాకుంభమేళాను సందర్శించలేదు. దీంతో వీరిద్దరిపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాము ‘హిందుత్వవాదులం’ (Hindutvavadis) అని చెప్పుకునే వీరిద్దరూ కుంభమేళాకు హాజరుకాలేదంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) వ్యాఖ్యానించారు. ‘వారు (రాహుల్, ఉద్ధవ్ ఠాక్రేని ఉద్దేశిస్తూ) తమను తాము హిందుత్వవాదులమని చెప్పుకుంటారు. కానీ ఇంతపెత్త ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాకు వెళ్లలేదు. వారు చెప్పే మాటలకు చేసే చేష్టలకు చాలా వ్యత్యాసం ఉంది. 65 కోట్ల మందికిపైగా హిందువులు ప్రయాగ్రాజ్వెళ్లారు.. కానీ వారు మాత్రం వెళ్లలేదు’ అంటూ షిండే పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా రాహుల్, ఠాక్రేలను తీవ్రంగా విమర్శించారు. హిందుత్వ సిద్ధాంతాలను విమర్శించే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఠాక్రేపై నిప్పులు చెరిగారు. ఆయన ఇప్పుడు (వీర్) సావర్కర్ ప్రత్యర్థులతో కలిసి నడుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాను సందర్శించకుండా ఇద్దరు నాయకులు హిందూ సమాజాన్ని అవమానించారని మరో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వ్యాఖ్యానించారు. హిందువుగా ఉంటూ మహాకుంభమేళాకు వెళ్లకపోవడం హిందువులను అవమానించడమే అవుతుందన్నారు. హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
కాగా, కాగా, జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు జరిగిన ఈ మేళాలో 66.21 కోట్ల మందికి పైగా పాల్గొని పుణ్య స్నానాలు చేశారు. ఇక ఆఖరి రోజు1.44 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్టు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఇది రికార్డులకెక్కింది. దేశ, విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ కుంభమేళాకు ప్రత్యక్షంగా హాజరు కాని భక్తులకు డిజిటల్ ఫొటో స్నానం చేయించడం విశేషం. ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీ హాజరుకాకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read..
Infosys | మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి.. ఇన్ఫీలో బలవంతపు లేఆఫ్స్‌పై పీఎంవోకు ఫిర్యాదు చేసిన ట్రైనీలు
Govinda divorce rumours | సునీత ఆరు నెలల క్రితం విడాకులకోసం దరఖాస్తు చేసుకున్నారు : లాయర్