India At UN | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది (India-Pakistan). మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశంగా పాకిస్థాన్‌ను అభివర్ణించింది.
కాగా, అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఈ క్రమంలో జెనీవా వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 58వ సమావేశంలో (United Nations Human Rights Council) భారత్‌పై పాకిస్థాన్ తీవ్ర విమర్శలు చేసింది. జమ్ము కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్ ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది.
భారత రాయబారి క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ నాయకులు, ప్రతినిధులు వారి సైనిక ఉగ్రవాద సమూహం నిర్దేశించిన అబద్ధాలను ప్రచారం చేయడం విచారకరం. ఇస్లామిక్ దేశాల కూటమిని తన వాణిగా మార్చుకుని దుర్వినియోగానికి పాల్పడి అపహాస్యం చేస్తోంది. మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశం వల్ల ఈ కౌన్సిల్ సమయం వృధా కావడం దురదృష్టకరం. పాకిస్థాన్ కపటత్వం, అమానవీయ చర్యలతో అసమర్థ పాలనను కొనసాగిస్తోంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుంటే.. ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవాన్ని కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టి సారిస్తుంది. మా నుంచి పాకిస్థాన్ ఈ విలువలు నేర్చుకోవాలి. మాపై ఆరోపణలు మాని.. మీ దేశంలోని ప్రజలకు సుపరిపాలన అందించడంపై దృష్టి పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), లద్ధాఖ్‌లు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని త్యాగి స్పష్టం చేశారు. దశాబ్దాల తరబడి పాకిస్థాన్ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ రెండు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దాయాది దేశం.. భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదంటూ చురకలంటించారు.
Also Read..
AAP | జైభీమ్ అన్నందుకు సస్పెండ్ చేశారు.. అసెంబ్లీకి రానీకుండా అడ్డుకుంటున్నారు : ఆతిశీ