Prashant Kishor | తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే కోట్లాది మంది ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ (Actor Vijay) కొత్త ఆశాకిరణమని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగం (Tamilaga Vettri Kazhagam) అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందన్నారు.
తమిళనాడులోని చంగల్పట్టు జిల్లాలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం టీవీకే రెండో వార్షిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఐపీఎల్లో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును గెలిపించినట్లుగా తాను రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రికళగంను గెలిపిస్తానని వ్యాఖ్యానించారు.
‘దేశంలో ఎక్కడాలేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉంది. అవినీతి, కుటుంబ పాలన రాష్ట్రంలో పోవాలి. అలా జరగాలంటే విజయ్ లాంటి వ్యక్తి రావాలి. విజయ్‌కు వ్యూహరచనల్లో సహాయం, ఎలాంటి సలహాలూ అవసరం లేదు. ఆయన ఆలోచనలు, సమాజంపై ఉన్న ప్రేమ, బాధ్యత నాకు తెలుసు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే కోట్లాది మంది ప్రజలకు విజయ్ ఓ కొత్త ఆశాకిరణం. నేను ఏ పార్టీతో, నాయకుడితో కలిసి పనిచేయనని నాలుగేళ్ల క్రితమే ప్రకటించాను. కానీ విజయ్ నాకు రాజకీయ నాయకుడు కాదు. ఆయన నాకు ఓ బ్రదర్ లాంటివాడు’ అని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ ఒక కొత్త రాజకీయ చరిత్రను సృష్టించబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read..
Earthquake | అస్సాంను వణికించిన భూకంపం
Waqf Bill | వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!
Woman Molest | బస్సులో యువతిపై లైంగిక దాడి.. పరారీలో నిందితుడు