Woman Molest | ముంబై, ఫిబ్రవరి 26( నమస్తే తెలంగాణ) : రద్దీగా ఉండే పుణెలోని స్వార్గేట్ బస్టాండ్‌లో నిలబడి ఉన్న శివషాహి బస్సులో ఓ 26 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్వార్గేట్ బస్టాండ్ పుణె నగరంలోని సురక్షితమైన బస్టాండ్లలో ఒకటిగా పేరు పొందింది. దానికి సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం… బాధితురాలు పుణె నుంచి ఫల్టన్లోని తన ఇంటికి వెళ్ళడానికి మంగళవారంస్వార్గేట్ బస్టాండ్‌కు వచ్చింది. అప్పుడు ఒక అపరిచితుడు ఆమె బస్సు మరొక ప్రదేశంలో ఆగిందని మాయమాటలతో నమ్మించి ఆమె ను సమీపంలో ఆగి ఉన్న శివషాహి బస్సు వద్దకు తీసుకెళ్లాడు.
అకడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని దత్తాత్రయ రాందాస్ గాడేగా పోలీసులు గుర్తించారు. అతనిపై శిక్రాపూర్, షిరూర్ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.