AAP | ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో తొమ్మిది రోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే మధ్యతరగతి ప్రజల కోసం ఆప్ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా 15 గ్యారెంటీలతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సోమవారం కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు, ఉపాధి కల్పన, ప్రజాసేవల్లో మెరుగుదల వంటి 15 కీలక వాగ్దానాలు చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తామని వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. మెట్రో ఛార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తామని హమీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అరవింద్ కేజ్రీవాల్ ఏడు డిమాండ్లు లేవనెత్తారు. ‘విద్యా బడ్జెట్ను రెండు నుంచి పది శాతానికి పెంచాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు సబ్సిడీలు, స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఆరోగ్య బడ్జెట్ను పది శాతానికి పెంచాలి, ఆరోగ్య బీమాపై పన్ను తొలగించాలి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 7 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచాలి. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించాలి. సీనియర్ సిటిజన్లకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ ఇవ్వాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ బడ్జెట్ను మధ్యతరగతి ప్రజలకు అంకితం చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
Also Read..
Amit Shah | మహాకుంభమేళాలో అమిత్ షా.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు
Mahakumbh: పుణ్యస్నానం కోసం కుంభమేళాకు.. పోలీసులకు చిక్కిన లిక్కర్ స్మగ్లర్
Maoists | బీజాపూర్ జిల్లాలో ఇన్ఫార్మర్ను కొట్టి చంపిన మావోయిస్టులు