బదోయి: ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల కోసం లక్షల సంఖ్యలో జనం వెళ్తున్నారు. మహాకుంభమేళా(Mahakumbh)లో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన ఓ స్మగ్లర్ .. పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్ల ప్రవేశ్ యాదవ్‌ను పోలీసులు పట్టుకున్నారు. మద్యం స్మగ్లింగ్ కేసులో అతను పరారీలో ఉన్నాడు. 2023 జూలై నుంచి అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ఏరియాలో నిఘా పోలీసులకు అతను దొరికాడు. బదోయి ఎస్పీ అభిమన్యు మాంగలిక్ ఆ అరెస్టు గురించి వివరించారు.
స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్‌ది రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా. ఏడాదిన్నర నుంచి అతను పరారీలో ఉన్నట్లు అభిమన్యు మాంగలిక్ తెలిపారు. 2023, జూలై 29వ తేదీన జాతీయ రహదారిపై .. అల్వార్ నుంచి బీహార్ వెళ్లే మార్గంలో.. వాహనాలు చెకింగ్ చేస్తున్న సమయంలో.. నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో ప్రదీప్ యాదవ్, రాజ్ దొమోలియాను అరెస్టు చేశారు. అయితే ప్రవేశ్ యాదవ్ మాత్రం పరారీ అయ్యాడు. అల్వార్ జిల్లాకు చెందిన నిందితులందరూ.. చాన్నాళ్లుగా బీహార్‌కు అక్రమ మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐపీసీతో పాటు ఎక్సైజ్ శాఖ చట్టంలోని 419, 420, 468, 471, 272, 273, 207 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానం చేసేందుకు వచ్చిన ప్రవేశ్ యాదవ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.