IIT Kharagpur : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ (Kharagpur) లో మరో విద్యార్థి (Student) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సెకండియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి చంద్రదీప్ పవార్ (Chabdradeep Pawar) సోమవారం రాత్రి చనిపోయాడు. గత నాలుగు రోజుల్లో ఆ సంస్థ క్యాంపస్‌లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చంద్రదీప్ వైద్యుడి సలహా మేరకు ఏదో మెడిసిన్ వాడినట్లు స్థానిక పోలీసులకు ఐఐటీ ఖరగ్‌పూర్ అధికారులు తెలియజేశారు. అతడు తీసుకున్న టాబ్లెట్ శ్వాసనాళంలో ఇరుక్కుపోయి, చివరికి అతని మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్ నివాసి అయిన చంద్రదీప్‌ను మొదట ఐఐటీ క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. అతని మరణానికి అసలు కారణం శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రే సమాచారం అందించడంతో వారు మంగళవారం ఉదయం ఖరగ్‌పూర్ చేరుకున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా చంద్రదీప్ ఒక రకమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు సమాచారం. అందువల్ల అతని మరణంపై కొంత గందరగోళం నెలకొందని ఇన్స్టిట్యూట్లోని ఒక అధికారి తెలిపారు. ఈ నెల 18న కూడా మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రితం మండల్ మృతదేహం అతని హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో కనిపించింది.