Amit Shah | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor).. ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులతో విరుచుకుపడ్డామని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 22వ సరిహద్దు భద్రతా దళం (BSF) ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత సాయుధ దళాలపై షా ప్రశంసల వర్షం కురిపించారు. సరిహద్దులను రక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్ చేశారు.
‘పహల్గాంలో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) మన ప్రజలను దారుణంగా చంపారు. ఈ దాడులతో అన్ని హద్దులూ దాటారు. ఈ దాడి తర్వాత తగిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని అప్పుడే చెప్పారు. అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor).. ఉగ్రవాదానికి దీటైన జవాబు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులతో విరుచుకుపడ్డాం. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందని ప్రపంచమంతా తెలుసు. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద పోషకులుగా నిరూపించుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా కొనియాడింది. మన సాయుధ దళాల అద్భుతమైన సామర్థ్యాలను ప్రశంసిస్తోంది. సరిహద్దులను రక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా’ అని అమిత్ షా తెలిపారు.
మన దేశం దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నట్లు అమిత్ షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మన దేశంపై దాయాది అనేక దాడులు చేసిందని గుర్తు చేశారు. వాటికి సరైన ప్రతిస్పందన ఇవ్వలేదన్నారు. అయితే, 2014లో మోదీ ప్రధాన మంత్రి అయినప్పుడు.. మన సైనికులను లక్ష్యంగా చేసుకొని ఉరిలో మొదటిసారి అతిపెద్ద ఉగ్రదాడి జరిగిందని చెప్పారు. దానికి మన సైన్యం సర్జికల్ స్ట్రైక్‌తో దీటుగా బదులిచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక పుల్వామా దాడికి భారత సైన్యం వైమానిక దాడి ద్వారా బలమైన ప్రతిస్పందన ఇచ్చిందని షా వివరించారు. ఇప్పుడు మరోసారి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి వాటిని ధ్వంసం చేసినట్లు చెప్పుకొచ్చారు.
Also Read..
IndiGo | గగనతలంలో అల్లకల్లోలం.. ఇండిగో అభ్యర్థనను తిరస్కరించిన పాక్