GLP-1 Medicine | ప్రస్తుతం బరువు తగ్గడానికి GLP-1 (Glucagon-Like Peptide-1) మందులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ మందులు శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే GLP-1 హార్మోన్ ప్రభావాన్ని అనుకరిస్తూ పని చేస్తాయి. ఈ హార్మోన్ ఆహారం తీసుకున్నప్పుడు విడుదల అవుతుంది. గ్లూకోజ్ మెటబాలిజంలో అలాగే ఆకలి నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ మందులు ప్రధానంగా ఆకలి తగ్గించడంతో పాటు పొట్ట నుండి ఆహారం బయటకు వెళ్లే వేగాన్ని నెమ్మదించేలా చేస్తాయి. తద్వారా బరువు తగ్గడంలో ఇవి సహాయపడతాయి. GLP-1 మందులు ఎక్కువ ప్రాచుర్యం పొందినప్పటికీ ఇవి ఎప్పటికీ స్థిరమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అందుకే వైద్యులు బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి వాటినే సిఫార్సు చేస్తూ ఉంటారు.
కొన్ని సహజంగా లభించే ఆహారాలు కూడా GLP-1 మందుల లాగా పని చేస్తాయి. ఈ ఆహారాలు కూడా ఆకలిని తగ్గించడంతో పాటు పొట్ట ఖాళీ అవ్వడాన్ని నెమ్మదిస్తాయి. ఈ ఆహారాలు సహజంగానే GLP-1, ఇతర హార్మోన్ల విడుదలను ప్రోత్సహిస్తాయి. GLP-1 ఔషధాల లాగా ప్రభావవంతంగా పనిచేయకపోయినా ఇవి మెదడుకు తృప్తిగా ఉన్నారనే సంకేతాన్ని అందిస్తాయి. GLP-1 మందుల లాగా పని చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు వంటి ఆహారాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయకుండా ఉంటుంది. ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది. నీటిలో కరిగే ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల ఆహారం పొట్ట నుండి బయటకు వెళ్లడానికి కూడా సమయం పడుతుంది.
గుడ్లు, పెరుగు, చేపలు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్లు వంటి వాటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. దీంతో ఎక్కువ సమయం సంతృప్తిగా ఉండవచ్చు. అదే విధంగా అవకాడో, ఆలివ్ నూనె, గింజల్లో లభించే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కడుపు నిండిన అనుభూతిని ప్రోత్సహిస్తాయి. ఈ కొవ్వులు నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది. పెరుగు, కేఫీర్, సౌర్‌క్రాట్, కిమ్చి వంటి ఆహారాల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ఆకలి నియంత్రణపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు నెమ్మదిగా శోషించబడతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండడంతో పాటు ఆకలి కూడా తగ్గుతుంది. ఈ ఆహారాలు కూడా GLP-1 మందుల లాగా పని చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
అలాగే మనం ఏం తింటున్నామో అని మాత్రమే కాదు ఎలా తింటున్నామో అని తెలుసుకోవడం కూడా ముఖ్యమే అని వైద్యులు తెలియజేస్తున్నారు. కార్బోహైడ్రేట్స్ తినే ముందు ప్రోటీన్, కూరగాయలు తీసుకోవడం వల్ల GLP-1 విడుదల పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. 20 నుండి 30 నిమిషాల పాటు నెమ్మదిగా నములుతూ భోజనం చేయడం వల్ల పొట్ట మెదడుకు సంతృప్తి సంకేతాలు పంపడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. ద్రవ ఆహారాల కంటే ఘన ఆహారాలు ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి. వీటిని ఎక్కువగా నమలడంతో పాటు కడుపులో ఎక్కువ సమయం ఉంటాయి కనుక ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి GLP-1 మందుల మీద ఆధారపడకుండా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చని ఈ ఆహారాలు కూడా ఆకలిని నియంత్రించడంతోపాటు తృప్తి భావనను కలిగిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.