Moscow | పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. పాకిస్థాన్ ప్రాయోజిక తీవ్రవాదం, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఇప్పటికే ఆయా దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అలా వెళ్లిన ఓ ప్రతినిధి బృందానికి తాజాగా భయానక అనుభవం ఎదురైంది.
డీఎంకే ఎంపీ కనిమోళి కరుణానిధి (DMK MP Kanimozhi) నేతృత్వంలోని దౌత్య బృందం రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, వీరు ల్యాండ్ అయ్యే సమయానికి మాస్కో (Moscow)లో డ్రోన్ దాడి (drone attack) జరిగింది. దీంతో మాస్కో ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ కారణంగా కనిమోళి నేతృత్వంలోని భారత దౌత్య బృందం విమానం గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. విమానం ల్యాండింగ్‌కు గంటల తరబడి ఆలస్యమైంది. ఈ ఘటనతో దౌత్య బృందం తీవ్ర భయాందోళనకు గురైంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు దేశాలు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా మాస్కోలో దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు కొన్ని గంటల పాటు నిలిపివేశారు. దీంతో భారత దౌత్య బృందం విమానం ల్యాండింగ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ అంతరాయం కారణంగా విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. గంటల తరబడి అలా గాల్లోనే ఉన్న విమానం చివరికి సురక్షితంగా మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు విమానాశ్రయంలో అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందాన్ని స్వాగతించి.. వారిని సురక్షితంగా వారి హోటల్‌కు తీసుకెళ్లారు.
Also Read..
IndiGo | గగనతలంలో అల్లకల్లోలం.. ఇండిగో అభ్యర్థనను తిరస్కరించిన పాక్
IMF | పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల సాయాన్ని సమర్థించుకున్న ఐఎంఎఫ్
Muhammad Yunus | రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..!