Tejashwi Yadav : బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో అత్యవసరంగా ఓటర్ల జాబితాను సవరించింది. ఈ సవరించిన జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ క్రమంలో కొత్త జాబితాను చూస్తే పాత జాబితాలో ఉన్న ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించినట్లు తెలుస్తోందని ఆర్జేడీ అగ్రనేత (RJD top leader) తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఆరోపించారు.
దాదాపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 నుంచి 30 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారని తేజస్వి చెప్పారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది ఓట్లు మాయమయ్యాయని తెలిపారు. ఈ సంఖ్య బీహార్ మొత్తం ఓటర్లలో 8.5 శాతమని అన్నారు. ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితాకు సంబంధించి ఎప్పుడు ప్రకటన చేసినా చాలామంది ఓటర్లు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని, చాలామంది ఓటర్లు మరణించారని, చాలామంది దొంగపేరుతో ఓట్లను పొందారని తెలిపేదని తేజస్వి గుర్తుచేశారు.
కానీ ఈసారి మాత్రం ఈసీ తెలివిగా వ్యవహరించిందని అన్నారు. తొలగించిన ఓటర్ల అడ్రస్లుగానీ, బూత్ నెంబర్లు గానీ, ఎపిక్ (EPIC) నెంబర్లను గానీ వెల్లడించలేదని చెప్పారు. దాంతో పాత ఓటర్ల జాబితా నుంచి ఎవరి ఓట్లను తొలగించారనేది గుర్తించడానికి వీల్లేకుండా పోయిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఇటీవల బీహార్‌లో ఓటర్ల జాబితాను అత్యవసరంగా సవరించింది. అయితే ఈ సవరణపై ఆర్జేడీ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
అత్యవసర సవరణ పేరు బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ ఉభయసభల్లో కూడా బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో 10 రోజులపాటు ఉభయసభల కార్యకలాపాలు తుడిచిపెట్టుకుపోయాయి. సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో 11వ రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.