Trump Tarrifs | న్యూఢిల్లీ, ఆగస్టు 1: వాణిజ్య ఒప్పందం కోసం భారత్ మెడలు వంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విధించిన సుంకాలు.. దేశ జీడీపీ ప్రగతికి ప్రతిబంధకాలేనని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు ఎగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై 25 శాతం టారిఫ్లుంటాయని ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఈ టారిఫ్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తం కొనసాగితే దేశ జీడీపీ ఈసారి 6 శాతం దిగువనే నమోదు కాగలదని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారిప్పుడు. 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు దిగజారవచ్చని అంతా అభిప్రాయపడుతున్నారు. ఏఎన్జెడ్ ఎకనామిస్టులు ధీరజ్ నీమ్, సంజయ్ మాథూర్ స్పందిస్తూ.. ‘అమెరికా 25 శాతం టారిఫ్‌లు వచ్చే ఏడాది మార్చి 31దాకా అమలైతే భారత జీడీపీ వృద్ధిరేటు 40 బేసిస్ పాయింట్లు క్షీణించవచ్చు’ అంటున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 6.1 శాతంగానే ఉంటుందని వారి అంచనా. దీంతో ట్రంప్ టారిఫ్ దెబ్బకు 5.5 శాతం దరిదాపుల్లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బార్క్లేస్ 30 బేసిస్ పాయింట్లు, నొమురా 20 బేసిస్ పాయింట్లు క్షీణించే వీలుందంటున్నాయి. అలాగే ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 6.3 శాతంగానే ఉండొచ్చని అంచనా వేసింది. మునుపు 6.4 శాతంగా ఉన్నది. ఇక పెట్టుబడులకూ ఇబ్బందేనని హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్తలు చెప్తున్నారు.
అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్.. తనకు గొప్ప మిత్రుడని చెప్పుకుంటూపోయిన ప్రధాని మోదీకి గట్టి షాకే తగిలింది. రష్యాతో స్నేహానికి చెక్ పెట్టకుండా, దానితో వాణిజ్య సంబంధాలను ఇంకా బలపర్చుకుంటున్నందుకుగాను ట్రంప్ ఏకంగా పెనాల్టీలనే విధించారు మరి. నిజానికి నువ్వా-నేనా అన్నట్టు టారిఫ్‌లతో కొట్టుకున్న అమెరికా-చైనాల మధ్య కూడా ఈ జరిమానాలు చోటుచేసుకోలేదు. తన మాట వినడం లేదని చైనాపై టారిఫ్‌లను పెంచారే తప్ప.. ఏనాడూ పెనాల్టీలను మాత్రం ట్రంప్ విధించలేదు. కానీ భారత్‌పై పెనాల్టీలను వేశారు. దీంతో ఇది మోదీ దౌత్య వైఫల్యమేనన్న విమర్శలు అంతటా వినిపిస్తున్నాయిప్పుడు.
భారత్‌సహా 69 దేశాలపై శుక్రవారం ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ నుంచి ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదలవగా, ఇందులో భారత్‌పై 25 శాతం టారిఫ్‌ను అలాగే కొనసాగించారు. కానీ, బంగ్లాదేశ్‌పై 35 శాతం నుంచి 20 శాతానికి, పాకిస్తాన్‌పై 29 శాతం నుంచి 19 శాతానికి సుంకాలను ట్రంప్ తగ్గించడం గమనార్హం. ఇక 10 శాతం నుంచి 41 శాతం వరకు ఆయా దేశాలపై టారిఫ్‌లు పడగా.. టాప్-10 దేశాలపై 30 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలున్నాయి. ఈ దేశాల్లో సిరియాపై అత్యధికంగా 41 శాతం ఉంటే.. లావోస్, మయన్మార్‌లపై 40 శాతం, స్విట్జర్లాండ్‌పై 39 శాతం, ఇరాక్, సెర్బియాలపై 35 శాతం, అల్జీరియా, బోస్నియా, లిబియా, దక్షిణాఫ్రికాలపై 30 శాతం చొప్పున టారిఫ్లున్నాయి. బ్రెజిల్, బ్రిటన్‌పై 10 శాతం, జపాన్, ఇజ్రాయెల్, ఈయూలపై 15 శాతం చొప్పున ఉన్నాయి.
టారిఫ్‌లతో ఠారెత్తిస్తున్న ట్రంప్.. వాటి అమలు విషయంలో పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని చెప్పగా.. ఇప్పుడు 7 నుంచి అమలవుతాయంటున్నారు. అయితే ఇది పొడిగింపు కాదని, కొత్త టారిఫ్‌ల వసూలుకు తగ్గట్టుగా కస్టమ్స్ శాఖ సిద్ధం కావడానికి మరింత సమయం ఇస్తున్నామని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. కాగా, శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ముంబైలో ఆయా రంగాల ఎగుమతిదారులతో సమావేశం కానున్నారు. వారి ఆందోళనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం.
రష్యా నుంచి ఆయుధాలు, ముడి చమురును కొంటున్నందుకు అమెరికా అధినేత ట్రంప్.. భారత్‌పై విధించిన జరిమానా ఎంతన్నదానిపై స్పష్టత లేకుండా ఉన్నది. శుక్రవారం వైట్‌హౌజ్ వర్గాలు విడుదల చేసిన నూతన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోనూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు మరి. కాగా, అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఆలస్యం చేస్తున్న దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇలా జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్లను దారికి కూడా తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే భారత్‌పైనా బుధవారం 25 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే రష్యాతో వాణిజ్య సంబంధాలకుగాను పెనాల్టీలూ ఉంటాయని చెప్పినది విదితమే.
అమెరికా విధించిన 25 శాతం టారిఫ్‌ల ప్రభావం.. ఆ దేశానికి వెళ్తున్న భారతీయ ఎగుమతుల్లో దాదాపు సగం ఎగుమతులపై పడవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25) అమెరికాకు భారత్ నుంచి 86.5 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు జరిగాయి. అయితే ఇందులో సగం ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రో ఉత్పత్తులు తదితరాల ఎగుమతులే. వీటిపై ఇప్పటికీ సుంకాల మినహాయింపున్నది. దీంతో అమెరికా సుంకాల ప్రభావం.. 40 బిలియన్ డాలర్ల (రూ.3.5 లక్షల కోట్లు) మేర జరిగే వస్తూత్పత్తుల ఎగుమతులపైనే ఉండొచ్చన్న అభిప్రాయాలు ఆర్థిక, వ్యాపార-పారిశ్రామిక రంగాల విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. కాగా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నది. ఈ నెల 25 నుంచి ఇరు దేశాల ప్రతినిధుల మధ్య 6వ విడుత చర్చలు జరుగబోతున్నాయి.
అమెరికా తమ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచేసింది. ఇవి అమల్లోకి వస్తే ఆ దేశ మార్కెట్లో మన వస్తూత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఇదే జరిగితే వాటి అమ్మకాలు భారీగా పడిపోతాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోకి మనకు పోటీగా రకరకాల వస్తూత్పత్తులు వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్‌ల నుంచీ వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ కంటే ఆయా దేశాలపై అమెరికా వేసిన సుంకాలు తక్కువగా ఉన్నాయి.
భారత్‌పై 25 శాతానికి మించి టారిఫ్‌లు పడుతుంటే వియత్నాం, బంగ్లాదేశ్‌లపై 20 శాతం చొప్పున, థాయిలాండ్‌పై 19 శాతంగానే ఉన్నాయి. ఫలితంగా అమెరికా మార్కెట్లో భారతీయ వస్తూత్పత్తుల కంటే తక్కువ ధరకే ఈ దేశాల ప్రోడక్ట్స్ అక్కడి వినియోగదారులకు లభిస్తాయి. అంతా వీటినే కొనేందుకు అవకాశం ఉంటుంది. చివరకు అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు తగ్గుతాయి. దానివల్ల ఇక్కడి పరిశ్రమల ఉత్పత్తి, వ్యాపారావకాశాలు, లాభాలు అన్నీ క్షీణిస్తాయి. అంతిమంగా ఉద్యోగ-ఉపాధి అవకాశాలు దూరమై, పెట్టుబడులకూ వీలుండదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే నష్టపరుస్తుంది.
ట్రంప్ టారిఫ్‌లు అమెరికాకు భారతీయ ఎగుమతుల్ని తీవ్రంగానే దెబ్బతీయవచ్చు. గత ఆర్థిక సంవత్సరం అమెరికాకు భారతీయ వాణిజ్య ఎగుమతులు 86.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం 60.6 బిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చు. తాజా సుంకాలతో భారత ఎగుమతులు 30 శాతం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-అజయ్ శ్రీవాత్సవ, జీటీఆర్ఐ వ్యవవస్థాపకుడు
అమెరికా సుంకాలు భారత వస్త్ర, దుస్తుల ఎగుమతుల్ని దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి బాధిత ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవాలి. వారు నష్టపోకుండా తగిన ప్రోత్సాహకాలు, మద్దతును అందించాలి.
-భారతీయ వస్త్ర పరిశ్రమ సమాఖ్య