షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లో జరుగుతున్న పర్యావరణ మార్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొంచెం గాలి వీచినా, ఆ రాష్ట్రం అదృశ్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది. అభివృద్ధి పనులను నియంత్రించకుంటే ఇలాగే జరుగుతుందని కోర్టు తన తీర్పులో హెచ్చరించింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఓ పిటీషన్ విచారణ సమయంలో పేర్కొన్నది.
ఆదాయం రాబట్టడమే కీలకం కాదు అని, కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గమనించాలని, పర్యావరణాన్ని దెబ్బతీసి ఆదాయాన్ని ఆర్జించలేమని కోర్టు చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న రీతిలో పనులు జరిగితే, భారత దేశ మ్యాప్ నుంచి హిమాచల్ ప్రదేశం మాయం అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఇలా జరగవద్దు అని ఆ దేవుడిని కోరుకుంటామని, ఇప్పుడైనా సరైన దిశలో చర్యలు తీసుకోవాలని సుప్రీం బెంచ్ తెలిపింది.
ప్రిస్టిన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ సంస్థ వేసిన పిటీషన్‌పై జూలై 28వ తేదీన వాదనలు జరిగాయి. ఆ సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శ్రీ తారా మాతా కొండపై హోటల్ నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. కానీ సుప్రీం ధర్మాసనం దాన్ని తిరస్కరించింది. వాతావరణ మార్పులు హిమాచల్ ప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఇది స్పష్టంగా కనిపిస్తోందని కోర్టు తెలిపింది.
హిమాచల్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, మంచు కురిసే పరిస్థితులు కూడా మారాయని, గరిష్ట వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయని కోర్టు చెప్పింది. హిమాలయ ప్రాంతంలో అనేక నదులకు జీవాధారమైన గ్లేసియర్లు త్వరగా కరుగుతున్నాయని, దీంతో అకస్మాత్తుగా వరదలు వస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. హిమాచల్‌లోని బారా షిగ్రి గ్లేసియర్ క్రమంగా తగ్గిందని కోర్టు తెలిపింది.