Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబై వచ్చిన విమానం ల్యాండింగ్ సమయంలో (Mumbai airport) రన్‌వేపై అదుపుతప్పింది (veered off the runway). అయితే, అదృష్టవశాత్తూ అందులోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఎయిర్ ఇండియాకు చెందిన AI 2744 విమానం సోమవారం తెల్లవారుజామున కొచ్చి నుంచి ముంబైకి వచ్చింది. ఉదయం ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. రన్‌వేపై అదుపుతప్పింది. ముంబైలో రాత్రి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. ఈ వర్షం కారణంగా రన్‌వేపై విమానం అదుపుతప్పినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. విమానం రన్‌వేపై అదుపుతప్పినప్పటికీ సురక్షితంగా నిర్దేశించిన బేకు చేరుకోగలిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదని వెల్లడించారు. అనంతరం విమానాన్ని తనిఖీ కోసం తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read..