Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు (technical glitch) ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన AI171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే.
తాజాగా అదే రూట్లో ప్రయాణించే మరో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఎయిర్ ఇండియా విమానం AI 159 మంగళవారం ఉదయం న్యూ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడి నుంచి అది లండన్ బయల్దేరాల్సి ఉంది. అయితే, టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య తెలెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీసును చివరి నిమిషంలో రద్దు చేశారు.
ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సోమవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన ఏఐ 315 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఇవాళ ఉదయం కూడా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వస్తున్న ఏఐ180 విమానంలో టెక్నికల్ ఇష్యూలు వచ్చాయి. గుర్తించిన పైలట్ మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతాలో విమానాన్ని నిలిపివేశారు. దీంతో భద్రత దృష్ట్యా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానంలోని ఇంజిన్లలో ఒకటి పనిచేయడం లేదని, దీంతో విమానం ఎగరడంలో ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు.
కాగా, గత గురువారం అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది.
Also Read..
Air India | మరో ఎయిర్ఇండియా విమానంలో సాంకేతిక సమస్య..
Plane Crash | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. డీఎన్ఏ ద్వారా 125 మృతదేహాల గుర్తింపు పూర్తి