Ahmedabad Plane Crash | గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ ఏ-171 విమానం 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్పై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మరణించారు. ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు.
విమానంలోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు. క్షణాల్లోనే ఘటనాస్థలి వద్ద 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు చెప్పారు. దీంతో ప్రమాదం నుంచి ఎవరూ బయటపడే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే 2 నుంచి 2:30 గంటల మధ్య తమ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నట్లు చెప్పారు.
అప్పటికే బీజే మెడికల్ కాలేజీకి చెందిన హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు సజీవంగా కాపాడినట్లు తెలిపారు. 2017లో ఎస్డీఆర్ఎఫ్లో చేరానని.. తాను ఇంతకు ముందు ఇలాంటి సంక్షోభ పరిస్థితులను ఎన్నో చూశానన్నారు. అయితే, ఇలాంటి విపత్తును మాత్రం గతంలో ఎన్నడూ చూడలేదని ఓ ఎస్డీఆర్ఎఫ్ అధికారి చెప్పుకొచ్చారు. పక్షులు, శునకాలు కూడా పారిపోలేనంత (dogs birds couldnt escape) స్థాయిలో ఘటనాస్థలి వద్ద ఉష్ణోగ్రత ఉందన్నారు. పీపీఈ కిట్లు ధరించి వచ్చినా.. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ కష్టతరంగా మారిందన్నారు. ఎక్కడ చూసినా శిథిలాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
విమానంలో భారీగా ఇంధనం: అమిత్షా
ఇంధనం మండుతున్న కారణంగా.. కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ఎవరినీ రక్షించే అవకాశం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, దాని వల్ల విమానంలో అత్యధికంగా ఉష్ణోగ్రత ఉన్నందువల్ల ఏ ఒక్క ప్రయాణికుడినీ రక్షించడం సాధ్యం కాదని చెప్పారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించిన తర్వాత మృతుల సంఖ్యను అధికారులు ప్రకటిస్తారని ఆయన చెప్పారు.
Also Read..
Ahmedabad Plane Crash | ఐదుగురి మృతదేహాలను గుర్తించిన అధికారులు.. కుటుంబ సభ్యులకు అప్పగింత
Black box | బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా
Ahmedabad Plane Crash | ప్రాణాలతో ఎలా బయటపడ్డానో నాకే తెలియదు.. విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు