Mumbai Dentist Suicide : ముంబైలో దారుణం జరిగింది. ప్రియుడి వేధింపులు భరించలేక 24 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డెంటల్ సర్జన్ (ఎండీఎస్) చదువుతున్న స్తుతి సోన్వానే (24) ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలోని ఆంటాప్ హిల్ సమీపంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార్థిని అయిన స్తుతి కొంతకాలంగా ఒక యువకుడితో ప్రేమలో ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఆ యువకుడు స్తుతిని మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.
స్తుతి తనను మోసం చేస్తుందనే అనుమానంతో ఆమెను తరచూ తిడుతుండేవాడు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ విమర్శించేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్తుతి తన ఇంట్లోని బెడ్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆరు పేజీల సూసైడ్ లెటర్ రాసింది. అందులో తన ప్రియుడి వేధింపుల గురించి వివరించింది. సోమవారం ఉదయం స్తుతి తన బెడ్ రూం నుంచి బయటకు రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా లోపలినుంచి స్పందన లేదు. ఉదయం 11 గంటలైనా బయటకు రాకపోవడంతో రూం తలుపులు బద్దలుకొట్టారు. డోర్లు తెరిచి చూసేసరికి స్తుతి ఉరివేసుకుని వేలాడుతూ ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఈ ఆత్మహత్యలో ప్రియుడి పాత్రపై విచారణ జరుపుతామన్నారు. మరోవైపు ఆమె రూం నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లో ప్రియుడి వేధింపుల గురించి స్తుతి ప్రస్తావించింది. ఢిల్లీలో కొంతకాలం క్రితం జరిగిన శ్రద్ధా వాకర్ హత్యలాగే, తాను కూడా ఏదో ఒక రోజు ప్రియుడి చేతిలో హత్యకు గురై బాడీ పార్ట్స్ ఫ్రిజ్లో కనిపిస్తాయని తన ఫ్రెండ్స్ అంటుండే వారని, తన ప్రియుడి వేధింపుల్ని చూసి వాళ్లు ఆ మాటలు అనేవారని స్తుతి తన సూసైడ్ లేఖలో పేర్కొంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.