న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇరాన్ నుంచి విద్యార్థులు, పౌరులను సురక్షితంగా భారత్ తరలించింది. అలాగే ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఈ విషయాన్ని గురువారం ప్రకటించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయం అందిస్తుందని తెలిపింది.
కాగా, ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రత కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘భారతీయులను తరలించడానికి టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నది. భారతీయ పౌరులు ఇప్పటికే నమోదు చేసుకోకపోతే (https://www.indembassyisrael.gov.in/indian_national_reg) ద్వారా నమోదు చేసుకోవాలి’ అని పేర్కొంది.
మరోవైపు ఏవైనా సందేహాలు ఉంటే టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24/7 కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. టెలిఫోన్ నంబర్లు: +972 54-7520711; +972 54-3278392, ఇమెయిల్: cons1.telaviv@mea.gov.in ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. అలాగే భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఇజ్రాయెల్ అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది.
Also Read:
China warns against ‘use of force’ | బలప్రయోగం చేయవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్