ADR | త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల నేర నేపథ్యం, ఆస్తిపాస్తులు, చదువు తదితర వివరాలను విశ్లేషిస్తూ కీలక సమాచారాన్ని వెలువరించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా విశ్లేషించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 278 మంది జాతీయ పార్టీల నుంచి, 29 మంది రాష్ట్రస్థాయి పార్టీల నుంచి, 254 మంది రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీల నుంచి.. మరో 138 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
ఏడీఆర్ 699 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించింది. ఈ సారి కళంకిత అభ్యర్థుల సంఖ్య తగ్గింది. ఈ సారి ఎన్నికల్లో పోటీలో ఉన్న 132 మంది అంటే 19శాతం మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా వెల్లడించారు. 2020 ఎన్నికల సమయంలో 672 మంది అభ్యర్థుల్లో 133 మంది (20శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా అఫిడవిట్లలో పేర్కొన్నారు. 81 మంది అభ్యర్థులపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో 104 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ప్రకటించారు. ప్రధాన పార్టీలన్నీ కళంకిత అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపాయి. ఈ సారి ఆప్ పార్టీ 70 మంది అభ్యర్థుల్లో 44 మందిపై అంటే దాదాపు 63శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 29 మంది (41శాతం) కళంకితులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి 68 మందిలో అభ్యర్థుల్లో 29 మంది (29శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ప్రకటించారు. ఆప్ నుంచి 41శాతం, కాంగ్రెస్ 13శాతం, బీజేపీ నుంచి 13శాతం మంది అభ్యర్థుల్లో తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లుగా ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 13 మంది అభ్యర్థులపై లైంగిక దాడులకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తెలిపారు. మరో ఇద్దరిపై హత్య కేసులు (IPC Section 302) నమోదైనట్లుగా వెల్లడించారు. మరో ఐదుగురి అభ్యర్థులపై హత్యామత్నం కేసులు (IPC Section 307) కేసులు ఉన్నట్లుగా వివరించారు.
ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. 699 మంది అభ్యర్థుల్లో 23 మంది (3శాతం) తమ ఆస్తులు రూ.50కోట్లకుపైగా ఉన్నాయని ప్రకటించారు. 2020 సమయంలో 672 మందిలో 13 మంది మాత్రమే.. రూ.50కోట్లు అంతకన్నా ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సారి రూ.50 కోట్లకుపైగా ఆస్తులు ఉన్న మొత్తం అభ్యర్థులలో ఐదుగురు బిలియనీర్స్ జాబితాలో చేరారు. ఇందులో బీజేపీకి చెందిన ముగ్గురు బిలియనీర్స్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒకరు, ఆప్ నుంచి ఒకరు ఉన్నారు. 699 మంది అభ్యర్థుల్లో రూ.10లక్షల కంటే తక్కువ ఆస్తి ఉన్న అభ్యర్థులు 222 మంది ఉన్నట్లుగా ఏడీఆర్ నివేదిక తెలిపింది. అదే సమయంలో రూ.5కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వారు 125 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ ఎనిమిది మంది, కాంగ్రెస్ ఏడుగురు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చాయి. వీరికి రూ.50కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అలాగే, ఇద్దరు స్వతంత్రులు రూ.50కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మొత్తం ఆస్తుల విలువ రూ.3,952 కోట్లుగా ఉందని పేర్కొంది. సగటు ఆస్తులు రూ.5.65కోట్లు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.4.34 కోట్లు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కర్నైల్ సింగ్ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. షకుర్ బస్తీ నుంచి పోటీ చేస్తున్న కర్నైల్ సింగ్ తనకు రూ.259 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. ఇక రెండో స్థానంలో రాజౌరి గార్డెన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మంజిందర్ సింగ్ సిర్సా తనకు రూ.248 కోట్లు ఉన్నట్లుగా వెల్లడించారు. 2020 ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా ధరంపాల్ లక్రా ఈ సారి.. తన ఆస్తులు రూ.76కోట్లుగా ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన రూ.292కోట్ల ఆస్తులతో పోలిస్తే 75శాతం తగ్గింది. అత్యధిక ఆదాయం ప్రకటించిన అభ్యర్థుల్లో బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ ముందంజల ఉన్నారు. ఆయన తన వార్షిక ఆదాయం రూ.19కోట్లుగా ప్రకటించారు. ముంజిందర్ సింగ్ సిర్సా ఆదాయం రూ.12కోట్లుగా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుమేష్ షౌకీన్ వార్షిక ఆదాయం రూ.9 కోట్లకు చెప్పారు. ఆప్‌కి చెందిన అవధ్ ఓజా తన వార్షిక ఆదాయం రూ.4.86 కోట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి అభ్యర్థి గుర్చరన్ సింగ్ వార్షిక ఆదాయం రూ.కోటి వెల్లడించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న 324 మంది అభ్యర్థులు తాము 5 నుంచి 12వ తరగతి వరకు చదివినట్లుగా ప్రకటించారు. అలాగే, 322 మంది తాము గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువగానే చదివినట్లుగా ప్రకటించారు. 18 మంది తాము డిప్లొమా హోల్డర్స్‌గా ప్రకటించారు. మరో 29 మంది తమకు చదువురాదని తెలిపారు. ఆరుగురు మాత్రం తాము కొంత వరకు చదువుకున్నట్లుగా తెలిపారు. మరో వైపు అభ్యర్థులను వయసు ఆధారంగా గ్రూపులుగా విభజిస్తే.. గరిష్ఠ సంఖ్యలో 394 మంది (41శాతం) 41 నుంచి 60 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారు. 25 నుంచి 40 సంవత్సరాల వయస్సు మధ్య 196 (28శాతం) మంది అభ్యర్థులు ఉన్నారు. 106 మంది అభ్యర్థులు తమ వయస్సు 61 నుంచి 80 సంవత్సరాల మధ్య ఉన్నట్లు ప్రకటించారు. మరో ముగ్గురు తమ వయసు 80 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందని అఫిడవిట్లలో పేర్కొన్నట్లుగా ఏడీఆర్ వివరించింది.
Maha Kumbh: పాలపుంతలా కుంభమేళా.. స్పేస్ స్టేషన్ నుంచి ఫోటో తీసిన ఆస్ట్రోనాట్
Snow Sculpture | ఆ మంచు శిల్పాలు అదుర్స్.. పోటీలో భారత్‌కు కాంస్యం.. Video