Heavy Rain | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గురువారం వర్ష బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి (lightning strikes). ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో సుమారు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
బీహార్‌లో 25 మంది మృతి
ముఖ్యంగా ఈ వర్షానికి బీహార్ (Bihar) రాష్ట్రం అతలాకుతలమైంది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పిడుగులు, వడగళ్ల వాన కారణంగా 25 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకారం.. నలందలో 18 మంది మరణించగా.. సివాన్‌లో ఇద్దరు, కతిహార్, దర్భంగా, బెగుసలరాయ్, బాగల్పూర్, జెహానాబాద్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
అయితే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం రాష్ట్రంలో వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 50 కంటే ఎక్కువే ఉంటుందన్నారు. మరోవైపు దర్భంగా, నలంద, పాట్నాతో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పాట్నాలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు 42.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
యూపీలో 22 మంది
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షం కురిసింది. 15 జిల్లాల్లో కురిసిన వర్షానికి 22 మంది మరణించారు. ఫతేపూర్, అజంగఢ్‌లో ముగ్గురు చొప్పున మరణించగా, ఫిరోజాబాద్, కాన్పూర్ దేహత్, సీతాపూర్‌లో ఇద్దరు చొప్పున, ఘాజీపూర్, గోండా, అమేథి, సంత్ కబీర్ నగర్, సిద్ధార్థ్ నగర్, బల్లియా, కన్నౌజ్, బారాబంకి, జౌన్పూర్, ఉన్నావ్‌లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
పిడుగుపాటుకు నలుగురికి గాయాలు
జార్ఖండ్ (Jharkhand)లోనూ గురువారం భారీ వర్షం కురిసింది. ధన్‌బాద్, హజారీబాగ్, కోడెర్మ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంటలు దెబ్బతిన్నాయి. చెట్లు నేలకూలాయి. డాల్టన్‌గంజ్‌లో 31.8 మి.మీ, రాంచీలో 7.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో పిగుడుపాటుకు నలుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు వృద్ధులు కూడా ఉన్నారు.
Also Read..
Google LayOffs | గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో లేఆఫ్స్.. వందలాది మందిపై వేటు..!
Tahawwur Rana | భారత్‌కు తహవ్వుర్ రాణా అప్పగింత తొలి ఫొటో విడుదల
Tariffs | చైనాపై బాదుడే బాదుడు.. 145 శాతానికి పెరిగిన ట్రంప్ టారిఫ్‌లు