లక్నో: మదర్సా టాయిలెట్లో 40 మంది బాలికలను నిర్బంధించారు. (Girls Locked In Toilet Of Madrassa) అధికారుల తనిఖీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కాని ఆ మదర్సా కార్యకలాపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పహల్వారా గ్రామంలోని మూడు అంతస్తుల బిల్డింగ్‌లో మూడేళ్లుగా మదర్సాను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
కాగా, బుధవారం పయాగ్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అశ్విని కుమార్ పాండే నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీ కోసం అక్కడకు వెళ్లింది. అయితే మదర్సా బిల్డింగ్ పై అంతస్తులోకి అధికారులు వెళ్లకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల సహాయంతో పై అంతస్తులోకి వెళ్లారు. టెర్రస్‌పై ఉన్న టాయిలెట్‌కు లాక్ వేసి ఉండటాన్ని అధికారులు గమనించారు.
మరోవైపు మహిళా పోలీసుల సమక్షంలో ఆ టాయిలెట్ డోర్‌ను అధికారులు తెరిపించారు. అందులో బంధించిన 40 మంది బాలికలు బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చారు. 9 నుంచి 14 ఏళ్ల వయస్సున్న ఆ బాలికలు భయంతో ఏమీ మాట్లాడలేదని అధికారులు తెలిపారు.
కాగా, ఆ మదర్సా రిజిస్ట్రేషన్, చట్టబద్ధతను ధృవీకరించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ ఖలీద్‌ను కోరినట్లు ఎస్డీఎం అశ్విని కుమార్ పాండే వివరించారు. అయితే తమకు ఎవరి నుంచి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read:
Watch: టెక్కీ ముఖంపై కారం పొడి చల్లి.. అతడి మూడేళ్ల కుమారుడు కిడ్నాప్
Watch: పార్కింగ్ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?