Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకూ 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా వెల్లడించారు. సుమారు 70 మంది గాయాలపాలైనట్లు తెలిపారు.
మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 225 మంది సైనిక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనలో వరద ఉద్ధృతికి చాలా మంది చలియార్ నదిలో కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతదేహాలు సైతం వరదలో కొట్టుకుపోతున్నట్లు పేర్కొంది. ఈ కొండచరియల ఘటనలో చూరాల్మాల గ్రామం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపింది. రోడ్లు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
Also Read..
Kerala | కేరళలో రానున్న 24 గంటల్లో భారీ వర్షం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Kerala | ట్రాక్‌పైకి భారీగా వర్షపు నీరు.. నిలిచిన రైళ్ల రాకపోకలు
Landslides | కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. 19 మంది దుర్మరణం