Landslides | తిరువనంతపురం : కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడ్డ 20 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటానస్థలానికి చేరుకుని మట్టిదిబ్బలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అదనపు బృందాలు కూడా వయనాడ్‌కు చేరుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కొండచరియలు విరిగిపడడంతో అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల స్కూల్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఇలాంటి విపత్తను ఇప్పటి వరకు చూడలేదని స్థానికులు తెలిపారు.
ముండకైలో అర్ధరాత్రి ఒంటి గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Howara-CSMT Express | పట్టాలు తప్పిన హౌరా – సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు మృతి
Gold Rates | మరింత దిగిన బంగారం.. తులం వెయ్యి రూపాయలదాకా తగ్గుదల
Husband Birthday | భర్తంటే ఎంత ప్రేమో.. చెట్టుకు భర్త డ్రెస్ తొడిగి జయంతి వేడుక