అగర్తలా, జూలై 29: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమితులు కావడంపై త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత జిష్ణు దేవ్ వర్మ స్పందించారు. అగర్తలాలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గవర్నర్గా నియమించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసే వరకు తనకు అసలు ఆ విషయం గురించి తెలియదని పేర్కొన్నారు. “శనివారం రాత్రి ప్రధాని మోదీ ఫోన్ చేసేంత వరకు తెలంగాణ కొత్త గవర్నర్గా నన్ను నియమించినట్టు నాకు తెలియదు.
మీరు త్రిపుర బయట పనిచేయాల్సి ఉంటుందని ప్రధాని చెప్పారు. అందుకు తనకు ఇచ్చిన ఏ బాధ్యతనైనా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని సమాధానం ఇచ్చాను. ఆ తర్వాతనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మరో కాల్ వచ్చింది. ‘వెల్కమ్ టూ తెలంగాణ’ అని ఆయన ఆహ్వానం పలికారు. తెలంగాణ గవర్నర్గా నియమితులైనట్టు అప్పుడే నాకు తెలిసింది.” అని జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. ఈనెల 31న తాను తెలంగాణకు వెళ్తానని, అదే రోజున కొత్త గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. తాను ఇంతకుముందు రాజకీయ పదవైన డిప్యూటీ సీఎంగా చేశానని, ఇప్పుడు రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించబోతున్నానని అన్నారు. సీఎంతో సమన్వయంతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు.
గవర్నర్గా తన నియామకం ప్రధాని మోదీకి త్రిపురపై శ్రద్ధకు నిదర్శనమని జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి గవర్నర్ అయిన తొలి వ్యక్తిని తానేనని సంతోషం వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు గవర్నర్గా వెళ్తున్నప్పటికీ, త్రిపుర అభివృద్ధికి తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకొనేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. త్రిపుర రాజ కుటుంబానికి చెందిన జిష్ణు దేవ్ వర్మ గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సెపాహిజాలా జిల్లా చరిలం స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆయన 1993లో కాంగ్రె స్ నుంచి బీజేపీలో చేరారు.