ముంబై: ఇండియా,పాకిస్తాన్ క్రికెటర్లు .. మ్యాచ్ టైంలో పరస్పరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడంలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఐసీసీ టోర్నీల్లో తలపడిన సమయంలో కరచాలనం చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఈ అంశంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దాదాగిరి చేయడం వల్ల భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం లేదని రౌత్ ఆరోపించారు. ఆసియాకప్‌లో ఆ తర్వాత గత ఆదివారం వరల్డ్‌కప్‌లో రెండు జట్లు పోటీపడ్డాయి. ఆ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోని విషయం తెలిసిందే.
పాకిస్థాన్, భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరగాల్సిన అవసరం లేదని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ మీరు ఆడాలనుకుంటే, అప్పుడు క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలన్నారు. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం లేదంటే అప్పుడు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆటగాళ్లపై దాదాగిరీ ప్రదర్శిస్తున్నట్లే అవుతుందన్నారు. అసలు మీరెందుకు ఆడుతున్నారు, ఒకవేళ పాకిస్థాన్‌తో ఆడకుంటే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు.
పాకిస్థాన్‌తో ఆడడం వల్ల బెట్టింగ్‌లో వేల కోట్లు ఆర్జిస్తున్నారని, దీంట్లో సగం డబ్బు పాకిస్థాన్‌కు వెళ్తుందని, ఆ డబ్బు నేరుగా దావూద్ ఇబ్రహీం, మసూద్ అజార్‌కు వెళ్తుందని, దీని వల్ల ఉగ్రవాదం మళ్లీ బలపడుతుందని శివసేన ఎంపీ రౌత్ అన్నారు.