Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దాడి (Delhi Blast) ఘటనపై దర్యాప్తులో కూపీ లాగేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. రాజధాని ప్రాంతంలో వరుస దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తాజాగా తేలింది. ముంబై 26/11 ఉగ్రదాడి తరహాలోనే రాజధానిలోని ఎర్రకోట (Red Fort), ఇండియా గేట్ (India Gate), కాన్స్టిట్యూషన్ క్లబ్ (Constitution Club), గౌరీ శంకర్ ఆలయం (Gauri Shankar Temple) వంటి రద్దీ ప్రదేశాలను టార్గెట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఉగ్ర దాడి కోసం భారీగా బాంబులను కూడా తయారుచేస్తున్నట్లు పేర్కొన్నాయి.
2008, నవంబర్ 26న ముంబైలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లియోపోల్డ్ హాస్పిటల్ సహా దాదాపు 12 ప్రదేశాల్లో ఉగ్రవాదులు భీకర దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అదే తరహాలో దేశరాజధాని ఢిల్లీలోనూ దాడులకు కుట్ర చేసినట్లు అధికారులను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఢిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కూడా తేలింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూల్ నెలల తరబడి ఈ దాడికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
దాడి కోసం అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీల (IED)ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఢిల్లీతోపాటూ గురుగ్రామ్, ఫరీదాబాద్ సహా దేశంలోని పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దేశంలోని మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సంబంధిత వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్, అనంత్‌నాగ్ ప్రాంతాలకు చెందిన కొంతమంది వైద్యులను ఎంపిక చేసినట్లు సమాచారం.
Also Read..
Delhi Blast | పేలుడుకు ముందు.. కన్నౌట్ ప్లేస్, మయూర్ విహార్‌లో సంచరించిన ఐ20 కారు