Al Falah University | అల్ – ఫలాహ్ యూనివర్సిటీ (Al Falah University).. గత రెండు రోజులుగా ఈ పేరు దేశం మొత్తం మార్మోగిపోతోంది. అందుకు కారణం ఫరీదాబాద్ (Faridabad) ఉగ్ర మాడ్యూల్, ఢిల్లీ పేలుడే (Delhi Blast). పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్‌ను పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. పలువురు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆ వైద్యులు అల్ – ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వారు కావడంతో ఈ వర్సిటీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. సోమవారం ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్‌కు కూడా ఈ వర్సిటీ వైద్యుడే కారణంగా తేలింది. దీంతో ఇప్పుడు ఈ వర్సిటీ పేరు దేశం మొత్తం మార్మోగిపోతోంది.
ఒకప్పుడు ఏ గ్రేడ్ అందుకున్న ఈ కాలేజీ.. ఇప్పుడు ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వైద్యులు, ఉపాధ్యాయుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తుకు కేంద్రంగా మారిన ఈ అల్-ఫలాహ్ వర్సిటీ ఎక్కడ ఉంది..? దీన్ని ఎవరు నడుపుతున్నారన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో గల ధౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ విశ్వవిద్యాలయం 1997లో ఇంజినీరింగ్ కళాశాలగా ప్రారంభమైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ అందుకుంది. 2014లో హర్యానా ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదాను కల్పించింది. ఆ తర్వాత ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ కోర్సులను ప్రారంభించారు. ఆ తర్వాత 2023లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా స్టార్ట్ చేసింది. ఈ యూనివర్సిటీ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
అల్ ఫలాహ్‌లో 650 పడకలతో కూడిన ఓ చిన్న ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. క్యాంపస్‌లో ఐదు బ్యాచ్‌లుగా ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 150-200 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ యూనివర్సిటీని అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ 1995లో ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీతో పాటు కొన్ని మదర్సాలు, అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఇతర ఛారిటీ సంస్థలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి జావెద్ అహ్మద్ సిద్దిఖీ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. అల్-ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి మేనేజింగ్ ట్రస్టీకూడా ఆయనే. అంతేకాదు అల్-ఫలాహ్‌కు చెందిన పలు కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనే. అల్-ఫలాహ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, అల్-ఫలాహ్ ఎడ్యుకేషన్ సర్వీస్, అల్-ఫలాహ్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలాహ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలాహ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, టార్బియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, అల్-ఫలాహ్ ఎనర్జీస్ లిమిటెడ్ సహా పలు సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక వర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ భూపిందర్ కౌర్ ఆనంద్ ఉన్నారు. ఆయన వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా కూడా పనిచేస్తున్నారు.
మరోవైపు ఈ యూనిర్సిటీలో 40 శాతం మంది డాక్టర్లు కశ్మీర్‌కు చెందిన వారే కావడం గమనార్హం. లోకల్ వైద్యులు, విద్యార్థులను కాకుండా ఎక్కువ మంది కశ్మీర్ ప్రాంతానికి చెందిన వారిని తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో ఇప్పటి వరకూ అరెస్టైన వైద్యులందరూ ఈ వర్సిటీకి చెందిన వారే కావడం కలకలం రేపుతోంది. దీంతో ఈ యూనివర్సిటీని ఉగ్రకార్యకలాపాలకు అడ్డాగా పేర్కొంటున్నారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ కారు పేలుడులో కీలక సూత్రధారులు ఐదుగురు వైద్యులే!
Delhi Blast | డాక్టర్లను ఉగ్రవాదులుగా మార్చిన మౌల్వీ.. ఢిల్లీ పేలుడు మాస్టర్ మైండ్ అతనేనా?