(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్రకుట్రకు, ఈ పేలుడుతో లింక్ ఉండటం.. ఈ భారీ కుట్రలో ఉన్నత విద్యావంతులైన ఐదుగురు డాక్టర్లు కీలక సూత్రధారులుగా తేలడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నది. దీంతో వీళ్లెవరూ? అన్న చర్చ జరుగుతున్నది.
డాక్టర్ ఉమర్ నబీ
ఢిల్లీ కారు పేలుడు సమయంలో ఆ వాహనంలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పుల్వామాకు చెందిన ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. తండ్రి జీహెచ్ నబీ భట్, తల్లి షమీమా బానో. ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదేండ్ల కిందట ఉద్యోగం నుంచి వైదొలిగారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ (మెడిసిన్) పూర్తి చేశాడు. కొన్నాళ్లు జీఎంసీ అనంత్‌నాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్య కళాశాలలో అసిస్ట్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. సోషల్‌మీడియాలో తీవ్రవాద భావజాలానికి బాగా ఆకర్షితుడయ్యాడు. కారు పేలుడు కుట్రకు ముందు శుక్రవారం తన తల్లికి ఫోన్ చేసిన ఉమర్.. లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నానని, తనకు ఫోన్ చేయవద్దని చెప్పాడు.
డాక్టర్ ముజమ్మిల్ గనీ
పుల్వామాలోని కోలికి చెందిన ముజమ్మిల్ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాడు. ఇతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు 358 కిలోల అమ్మోనియమ్ నైట్రేట్, పలు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్నారు. అద్దెకు తీసుకొన్న గదిలో ముజమ్మిల్ బాంబులను తయారు చేసినట్టు అనుమానిస్తున్నారు. లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహిన్ కూడా ఈ ఉగ్ర కుట్రలో భాగమయ్యారు. ఈమె ముజమ్మిల్‌కు ప్రేయసిగా భావిస్తున్నారు.
డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్
కశ్మీర్‌లోని కుల్గామ్ నుంచి యూపీలోని సహారన్పూర్కు మకాం మార్చిన అదిల్.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానలోనే ముజమ్మిల్, ఉమర్‌తో కలిసి వైద్యుడిగా పని చేస్తున్నాడు. జీఎంసీ శ్రీనగర్‌లోని ఇతని లాకర్ నుంచి ఏకే-47ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
డాక్టర్ అహ్మద్ మొహీయుద్దీన్ సయ్యద్
చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ తెచ్చుకొన్న అహ్మద్.. హైదరాబాద్‌లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. రాజేంద్రనగర్‌లో షవర్మా బిజినెస్ కూడా నడుపుతున్నాడు. సోషల్‌మీడియాలో తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఇతరులకు భోదనలు చేసేవాడు.
కుట్రదాడుల్లో లేడీ డాక్టర్

అరెస్టయిన నలుగురు డాక్టర్లలో లేడీ డాక్టర్ షాహిన్ కూడా ఉండడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ షాహిన్ సయీద్ ఢిల్లీ కారు పేలుడుకు నిధులు సమకూర్చడంతోపాటు, ఆపరేషన్ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్-మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉమర్‌తో షాహిన్ చేతులు కలిపినట్లు తెలిపాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో పేలిపోయిన కారును నడుపుతున్నది డాక్టర్ ఉమర్గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్న ముజామిల్తో కూడా షాహిన్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
పేలుడుకు పథక రచన చేసిన ప్రధాన ఉగ్ర గ్రూపుతో వీరిద్దరికీ ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు వారు చెప్పారు. భారత్‌తో మానసిక యుద్ధం చేసేందుకు ఓ మహిళా బ్రిగేడ్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నిషిద్ధ ఉగ్ర గ్రూపు జైషే మొహమ్మద్ దాని నాయకురాలిగా షాహిన్‌ను నియమించిందని, భారత్‌లో జైష్ కోసం మహిళలను నియమించే బాధ్యతను షాహిన్ పర్యవేక్షిస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. జమ్ము కశ్మీరును పలుమార్లు సందర్శించిన డాక్టర్ షాహిన్‌కి ఈ దాడి గురించి ముందే తెలియడమేగాక ఇందుకు నిధులు సమకూర్చడంలో కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలిపాయి. షాహిన్ రూ.35-40 లక్షలు సేకరించినట్లు వారు చెప్పారు.