Delhi Blast | న్యూఢిల్లీ: ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో సోమవారం కారు పేలుడు సంభవించడానికి కొన్ని గంటల ముందు పోలీసులు ఛేదించిన ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ వెనుక కీలక పాత్రధారిగా జమ్ము కశ్మీరులోని షోపియాన్‌కు చెందిన మౌల్వీ ఇర్ఫాన్ ఉన్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. వైద్య విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడంలో మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ కీలక పాత్రను పోషించాడు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ)లో పారా మెడికల్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్‌కు విద్యార్థులందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. నౌగామ్ మసీదులో కూడా అతను ఇమామ్‌గా ఉన్నాడని నిఘా వర్గాలు వెల్లడించాయి.
పేలుడు వెనుక మౌల్వీ?
శ్రీనగర్‌లోని నౌగామ్‌లో అక్టోబర్ 27న ఉగ్రవాద గ్రూపు జైషే మొహమ్మద్‌ని బలపరుస్తూ పోస్టర్లు వెలియడంతో జమ్ము కశ్మీరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో రాళ్లు రువ్విన చరిత్ర ఉన్న జైషేకి చెందిన ముగ్గురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా వారు మౌల్వీ ఇర్ఫాన్ పేరు వెల్లడించారు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా డాక్టర్ అదిల్ అహ్మద్ రాథెర్, జమీర్ అహన్గర్లను అరెస్టు చేశారు. ఈ ఆరెస్టుల ఆధారంగా మౌల్వీకి చెందిన గదుల నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ ముజమ్మిల్‌ని జమ్ము కశ్మీరు పోలీసులు అరెస్టు చేశారు.
ఫరీదాబాద్‌లో వీరు అద్దెకు తీసుకున్న గదుల నుంచే 350 కిలో అమ్మోనియం నైట్రేట్, ఆయుధాలు, బాంబు తయారీ సామగ్రి, ఏకే 47 రైఫిల్, 2,563 కిలోల అనుమానాస్పద పేలుడు పదార్థాలను భద్రతా సంస్థలు ఇటీవల స్వాధీనం చేసుకున్నాయి. వైద్య విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడంలో మౌల్వీ కీలకంగా వ్యవహరించాడు. జైషేతో స్ఫూర్తి పొందిన మౌల్వీ విద్యార్థులకు వీడియోలు చూపించేవాడు. వీఓఐపీ ద్వారా అఫ్ఘానిస్థాన్‌లో ఎవరితోనో మాట్లాడేవాడని నిఘా వర్గాలు తెలిపాయి. వైద్య విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చడానికి మౌల్వీ చురుకుగా పనిచేస్తే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ముజమ్మిల్, ఒమర్ పనిచేశారని నిఘా వర్గాలు చెప్పాయి. లేడీ డాక్టర్ షాహీన్ నిధులు సమకూర్చడం వంటి బాధ్యతలు చూసుకునేదని, అయితే వ్యూహకర్త మాత్రం మౌల్వీయేనని తెలిపాయి.