Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు చేస్తున్న కొద్దీ క్షణానికో కొత్త విషయం బయటపడుతోంది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న వైద్యులు దాడికి కుట్ర పన్నినట్లు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. ఈ దాడికి డాక్టర్ ఉమర్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.
ఈ దాడికి పది రోజుల ముందు అంటే అక్టోబర్ 29న హ్యుందాయ్ ఐ20 కారును కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కారుకొన్న వెంటనే పొల్యూషన్ చెక్ చేయించారు. ఆ తర్వాత దాన్ని ఫరీదాబాద్‌లోని అల్-ఫలా విశ్వవిద్యాలయంలో పార్క్ చేశారు. దాదాపు 11 రోజులపాటూ అంటే అక్టోబర్ 29 నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ ఆ కారు వర్సిటీ పార్కింగ్ ప్లేస్లోనే ఉంది. ఈ కారు చాలా మంది చేతులు మారినట్లు తేలింది. కానీ ఓనర్ షిప్ రికార్డులు మాత్రం మారకపోవడం గమనార్హం. నకిలీ పత్రాలు ఉపయోగించి ఈ కారును కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
ఇటీవల జమ్ముకశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు సంయుక్త బృందం ఫరీదాబాద్‌లో వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్ము కశ్మీరులో ఏకకాలంలో జరిగిన అరెస్టులలో 2,900 కిలోలకు పైగా బరువున్న బాంబు తయారీ సామగ్రి, రైఫిళ్లు, పిస్టళ్లు, ఇతర అనుమానాస్పద పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ముజమ్మీల్ గనీ, డాక్టర్ సాహీన్ హసీన్‌ను అరెస్ట్ చేశారు.
వీరు అరెస్ట్‌తో భయాందోళనకు గురైన డాక్టర్ ఉమర్ నవంబర్ 9వ తేదీ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతకుముందు నుంచే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి విశ్వవిద్యాలయం విధులకు కూడా హాజరుకాలేదని అధికారులు గుర్తించారు. ఇక నవంబర్ 10వ తేదీన హుటాహుటిన వర్సిటీలో పార్క్ చేసిన కారును బయటకు తీశారు. దాంతో ఢిల్లీకి పయనమయ్యారు. దొరికిపోతానన్న భయంతోనే ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు..!