Delhi Blast | ఢిల్లీలో కారు పేలుడు (Delhi Blast) ఘటనపై దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తోన్న ఉగ్రకుట్రకు, ఈ పేలుడుతో లింక్ ఉండటం.. ఈ భారీ కుట్రలో ఉన్నత విద్యావంతులైన ఐదుగురు డాక్టర్లు కీలక సూత్రధారులుగా తేలడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నది. ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
పేలుడుకు ముందు దుండగులు పలుమార్లు ఎర్రకోట (Red Fort) వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్ర చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జాతినుద్దేశించి ప్రసంగించనున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ దవాఖానలో డాక్టర్‌గా పనిచేస్తున్న పుల్వామాలోని కోలికి చెందిన ముజమ్మిల్ (Muzammil)ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడిని అధికారులు విచారిస్తున్నారు. అతడి ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతను పలుమార్లు ఎర్రకోటను సందర్శించినట్లు ఫోన్ డేటా ద్వారా తేలింది. మొహమ్మద్ ఉమర్‌తో కలిసి ఎర్రకోటపై నిఘా పెట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ కారు పేలుడులో కీలక సూత్రధారులు ఐదుగురు వైద్యులే!
ఢిల్లీ పేలుళ్ల సూత్రధారులను శిక్షిస్తాం
Delhi Blast | డాక్టర్లను ఉగ్రవాదులుగా మార్చిన మౌల్వీ.. ఢిల్లీ పేలుడు మాస్టర్ మైండ్ అతనేనా?