థింపూ/న్యూఢిల్లీ: భయంకరమైన ఢిల్లీ పేలుళ్ల సూత్రధారులను కోర్టు(న్యాయం) ముందు నిలబెట్టి శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కుట్రను దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయని తెలిపారు. భూటాన్ రాజధాని థింపూలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బాధిత కుటుంబాల శోకాన్ని నేను అర్థం చేసుకున్నాను. దేశం మొత్తం వారికి అండగా ఉంది. ఈ ఘటన గురించి నేను ఎప్పటికప్పుడు అన్ని దర్యాప్తు సంస్థల నుంచి వివరాలు తెలుసుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.
ప్రతి నేరస్తుడినీ వేటాడండి: షా
ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు కారణమైన ప్రతి ఒక్క నేరస్తుడిని వేటాడి పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీనియర్ అధికారులను ఆదేశించారు. ఈ మారణ కాండకు పాల్పడిన ప్రతి ఒక్కరూ దర్యాప్తు సంస్థల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని అన్నారు.