Hema | దాదాపు రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో పలువురు తెలుగు వ్యక్తుల పేర్లు వినిపించడంతో పాటు సీనియర్ నటి హేమ పేరు కూడా బయటకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అనంతరం కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ వివాదం క్రమంగా సద్దుమణిగింది. ఇటీవల తెలంగాణలో మరోసారి డ్రగ్స్ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఆ పాత కేసును ప్రస్తావిస్తూ హేమ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌పై తెలంగాణ ఈగల్ టీమ్, పోలీసులు దాడులు నిర్వహించగా డ్రగ్స్ పార్టీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నేతల పేర్లు వినిపించడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో బెంగళూరులో జరిగిన డ్రగ్స్ కేసును గుర్తు చేసుకుంటూ హేమ తన అనుభవాలను పంచుకున్నారు. 2024 మే 19న బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు మే 20 తెల్లవారుజామున దాడులు చేపట్టారు. ఆ సమయంలో మొత్తం 88 మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో 9 మంది నిర్వాహకులు ఉండగా, మిగిలిన వారిపై డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలు నమోదయ్యాయి. హేమతో పాటు మొత్తం 79 మంది డ్రగ్స్ వినియోగించారన్న ఆరోపణలతో పోలీసులు కోర్టులో వెయ్యికి పైగా పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో తాను ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని అప్పట్లోనే చెప్పినప్పటికీ, తనపై తీవ్ర ఆరోపణలు కొనసాగాయని హేమ అన్నారు. తాను ఒక సెలబ్రిటీ కావడం వల్లే తనపై ఎక్కువగా ప్రచారం జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు తనపై వచ్చిన ఆరోపణలను పదేపదే ప్రసారం చేసినప్పటికీ, తరువాత తాను నిర్దోషినని తేలిన విషయాన్ని మాత్రం పెద్దగా ప్రస్తావించలేదని ఆమె విమర్శించారు. ఈ కేసులో విచారణ అనంతరం 2025 జనవరి 2న బెంగళూరు కోర్టు హేమ వాదనలు పరిశీలించి, ఆమె డ్రగ్స్ వినియోగించలేదని తేల్చి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో తాను నిర్దోషినని న్యాయపరంగా నిరూపితమైందని హేమ తెలిపారు. కేసు విచారణ కొనసాగిన సమయంలో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని హేమ వెల్లడించారు. ఎన్నిసార్లు తనకు తప్పు లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే నిజం బయటపడిందని చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్టయితేనే దోషులని భావించడం సరైంది కాదని హేమ అన్నారు. జైలుకు వెళ్లినంత మాత్రాన ఎవరు నేరం చేసినట్టు కాదు అని ఆమె స్పష్టం చేశారు.