సిద్దిపేట, మార్చి 14: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లపై రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. భూసేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి రైతుల పక్షాన ఆయన లేఖరాశారు. నీటి పారుదల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ పలు అంశాలు ప్రస్తావించారు. 2020 నుంచి 2023 వరకు రిజర్వాయర్ల ద్వారా ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తిచేసి సిద్దిపేట జిల్లాలో సుమారు లక్షా ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించినట్లు పేర్కొన్నారు.
ప్రతి యాసంగిలోనూ కాలువల ద్వారా చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు నింపామని, ఆయకట్టుకు నీళ్లు అందించి రైతులకు ఎంతోమేలు చేశామని లేఖ ద్వారా మంత్రికి తెలిపారు. దీని ఫలితంగా పంట దిగుబడి సైతం భారీగా పెరిగిందని, కానీ 2023 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రిజర్వాయర్లను నిర్లక్ష్యానికి గురి చేస్తున్నదని, అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్నా నేటికీ ఒక రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 27 నెలల్లో ఒక గజం కాలు వ తవ్వలేదన్నారు. మైనర్, సబ్ మైనర్ కాలువల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాల్సి ఉందని, ఈ విషయంపై పలుమార్లు లేఖల రూపంలో, ఫోన్ల ద్వారా, వ్యక్తిగతంగా కలిసి వివరించానని లేఖలో పేరొన్నారు.. కాంగ్రెస్ ప్రభు త్వ నినాదం ప్రకారం ‘తకువ ఖర్చుతో ఎకువ ఆయకట్టు’ అనే నినాదం సిద్దిపేట జిల్లాలో సాధ్యమవుతుందన్నారు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా అన్నపూర్ణ(అంతగిరి) రిజర్వాయర్ ప్యాకేజీ-10కి సంబంధించి రూ.15కోట్లు, రంగనాయకసాగర్ (ప్యాకేజీ-11) కోసం రూ.15 కోట్లు కేటాయించాలని కోరారు. రూ.30కోట్లతో భూసేకరణ పూర్తయితే అదనంగా లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు పెరుగుతుందన్నారు. సర్కార్ నిర్లక్ష్యం వల్ల కొత్త ఆయకట్టు ముందు కు సాగడం లేదని, ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. వెంటనే కాలువల నిర్మాణం, భూసేకరణ చేపట్టేందుకు రూ.30కోట్లు మంజూరు చేయాలని రైతుల పక్షాన హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.