షిల్లాంగ్ : మేఘాలయ అసెంబ్లీలో బుధవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మూడేండ్ల క్రితం మంత్రివర్గం ఆమోదించిన కీలక విద్యా ప్రాజెక్టులలో జాప్యంపై ఎన్పీపీ ఎమ్మెల్యే మెహతబ్ చాందీ సంగ్మా.. సీఎం కన్రాడ్ కే సంగ్మాను నిలదీశారు. ఇందులో విశేషం ఏమిటంటే వారిద్దరూ భార్యాభర్తలు కావడం. అయినప్పటికీ ప్రజా సమస్యలపై భర్తను నిర్మొహమాటంగా నిలదీసి ఆమె ప్రశంసలు అందుకున్నారు.
తొలుత వెటర్నరీ కాలేజీ ఏర్పాటు ప్రతిపాదన ఏమైందని ప్రశ్నించిన ఆమె దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు ఫిషరీ కళాశాలలు, ఒక డెయిరీ కాలేజీలకు 2022లోనే ఆమోదం పొందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రంలోని వెటర్నరీ శిక్షణ కేంద్రాల్లో సరిపడా సిబ్బంది లేని విషయాన్ని ఆమె ఎత్తిచూపారు. సిబ్బంది లేమిని అంగీకరించిన సీఎం, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు.