టెల్ అవీవ్, ఫిబ్రవరి 25: ఇజ్రాయెల్‌కు భారతదేశ బలమైన మద్దతును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పునరుద్ఘాటించారు. ఇప్పుడు, ఎప్పుడూ ఆ దేశంతో దృఢంగా నిలుస్తామని అన్నారు. అదే సమయంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఆ దేశ చట్టసభ సెన్సెట్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రస్తుత భౌగోళిక రాజకీయ దృశ్యంలో భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు చరిత్రాత్మకమైనవి, కీలకమైనవిగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ దాడిని ప్రస్తావించిన ప్రధాని భారత ప్రజల తరపున సంతాపం తెలిపారు. ఆయన మద్దతును ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు హర్షధ్వానాలు, చప్పట్లతో స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్’ను ప్రదానం చేసింది. ఇజ్రాయెల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ నెస్సెట్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. అలాగే ఇజ్రాయెల్‌ను తొలిసారిగా(2017లో) సందర్శించిన భారత ప్రధాని కూడా మోదీయే.