ఖమ్మం రూరల్, ఆగస్టు 12 : సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణీంద్ర మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల మాటలు నమ్మి వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యంగా బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు, టెలికాం సిబ్బంది పేరుతో ఫోన్ చేసి ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలు అడగడం, వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగాలు, బహుమతులు, లోన్ల పేరుతో లింకులు పంపి డబ్బులు వసూలు చేయడం, డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి నగదు బదిలీ చేయించడం వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు ఖాతా నిలిచిపోతుందని లేదా పోలీసు కేసు నమోదైందని బెదిరించినప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని తెలిపారు. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని, ఓటీపీ లేదా పాస్వర్డ్లను ఎవరికీ చెప్పకూడదని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరాలను చాలా వరకు అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా సైబర్ నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.