న్యూఢిల్లీ : తండ్రి మరణం తర్వాత వచ్చే పెన్షన్ కోసం ఓ మహిళ నాలుగు దశాబ్దాలకుపైగా పోరాటం చేస్తున్నారు. పేరులో ఒక్క అక్షరం తేడా ఉందనే కారణంతో పెన్షన్‌ను ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం, అధికారుల తీరుపై మండిపడింది. సమస్య పరిష్కారానికి వారంలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన మంజు తండ్రి శిఖర్ నాథ్ శుక్లా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేశారు. 1975లో ఉద్యోగ విమరణ చేశారు. 1980లో మృతి చెందగా.. అప్పటివరకు పెన్షన్ సరిగానే వచ్చింది. అనంతరం ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా, సర్వీస్ రికార్డులోని తండ్రి పేరు శిఖర్ నాథ్ శుక్లా అని నమోదైంది. దీంట్లో ఆంగ్ల అక్షరం ‘ఐ’ స్థానంలో ‘ఈ’ అని ఉండటం సమస్యగా మారింది.