Nails | గోర్లు మన శరీర ఆరోగ్యానికి అద్దంలా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోర్ల రంగు, ఆకారం లేదా వాటి ఉపరితలంలో కనిపించే మార్పులు కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతాలుగా ఉంటాయి. గోర్లలో కనిపించే అసాధారణ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే కొన్ని వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే గోళ్లలో మార్పులు కనిపించాయంటే తప్పనిసరిగా తీవ్రమైన వ్యాధే ఉందని అర్థం కాదు. కానీ అవి ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిది. గోర్లు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం. గోర్లను క్రమం తప్పకుండా కత్తిరించడం, శుభ్రంగా ఉంచడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. అదే సమయంలో గోర్లలో కనిపించే చిన్నచిన్న మార్పులు కూడా శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితిని సూచించే అవకాశం ఉంటుంది.
గోర్లు పాలిపోయినట్లు లేదా తెల్లగా కనిపిస్తే అది రక్తహీనత (అనీమియా), పోషకాహార లోపం లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలకు సంకేతంగా ఉంటుంది. ఈ లక్షణం ఎక్కువకాలం కొనసాగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. గోర్లు ఎక్కువ భాగం తెల్లగా ఉండి, అంచులు మాత్రం ముదురు రంగులో కనిపిస్తే అది కొన్ని కాలేయ వ్యాధులతో సంబంధం కలిగి ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. గోర్లు పసుపు రంగులోకి మారడం వెనుక అత్యంత సాధారణ కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగే కొద్దీ గోరు మందంగా మారడం, గోరు అడుగు భాగం విడిపోవడం, గోరు పెళుసుగా మారి ముక్కలుగా విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అరుదైన సందర్భాల్లో పసుపు రంగు గోర్లు థైరాయిడ్ సమస్యలు లేదా ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా సంకేతంగా ఉంటాయి. గోర్లకు నీలిరంగు ఛాయ కనిపిస్తే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందడం లేదనే సూచన అని భావించాలి. ఇలాంటి లక్షణాలు ఊపిరితిత్తులు లేదా గుండెకు సంబంధించిన సమస్యలతో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది.
గోర్ల ఉపరితలంపై అలల మాదిరిగా గీతలు లేదా ఎత్తుపల్లాలు కనిపిస్తే అది సోరియాసిస్ ప్రారంభ లక్షణంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌కు కూడా సంకేతం అవుతుంది. ఇలాంటి గోర్లు రంగు మారడంతోపాటు వాటి కింద చర్మం ఎర్రని-గోధుమ రంగులో కనిపించే అవకాశం ఉంటుంది. గోర్లు పగిలిపోవడం లేదా చీలిపోవడం, ముఖ్యంగా పసుపు రంగుతో కలిసి కనిపిస్తే దాన్ని కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సంకేతంగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ వ్యాధులు కూడా దీనికి కారణం అవుతాయి. గోర్ల చుట్టూ ఉన్న చర్మం వాపులకు గురైనట్లు, ఎర్రగా కనిపిస్తే అది నెయిల్ ఫోల్డ్‌లో ఇన్ఫ్లమేషన్ కారణంగా ఉంటుంది. కొన్ని రకాల కనెక్టివ్ టిష్యూ సంబంధిత వ్యాధులు కూడా ఈ లక్షణానికి కారణమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గోర్లలో ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా గమనించడం ముఖ్యం. మార్పులు ఎక్కువకాలం కొనసాగినా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.