హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ ( Letter ) రాశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అమలైన ‘నేతన్న బీమా’, ‘నేతన్నకు చేయూత’ వంటి అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసి నేతన్నలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. వెంటనే అన్ని పథకాలను పునరుద్ధరించి నేతన్నలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవం కేవలం ఉత్సవాలు నిర్వహించుకునే రోజు కాదని, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేనేత రంగాన్ని సంక్షోభం వైపు నెడు తున్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత రంగానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ ‘నేతన్న బీమా’ అమలు చేశామని తెలిపారు. ఒక్కో కార్మికుడికి ప్రీమియం ప్రభుత్వమే భరించిందని వివరించారు. ‘నేతన్నకు చేయూత’ పథకం ద్వారా కార్మికుల పొదుపును ప్రోత్సహిస్తూ, కార్మికుడు ప్రతి నెలా రూ.1,200, అనుబంధ కార్మికుడు రూ.800 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4,000 వరకు వాటా జమ చేసే వినూత్న విధానాన్ని అమలు చేశామని తెలిపారు.
అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, 20 శాతం మార్కెటింగ్ రిబేట్ అందించడంతో పాటు బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాల యూనిఫారాల తయారీ వంటి భారీ ప్రభుత్వ ఆర్డర్లను చేనేత రంగానికే అప్పగించి వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పించామని పేర్కొన్నారు.
చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫారాల వంటి ప్రభుత్వ ఆర్డర్లలో నేతన్నలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గించారని విమర్శించారు. ప్రభుత్వ ఆర్డర్లు అన్ని కమీషన్ల కోసం ప్రైవేట్ సంస్థలకు వ్యక్తులకు అప్పజెప్తున్నారని విమర్శించారు. చేనేత భరోసా కింద ప్రతి ఏడాది రూ.18 వేల ఆర్థిక సాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సహాయం, లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణమాఫీ, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత రంగానికి తీవ్ర అన్యాయం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను రద్దు చేయడం, హౌస్ కమ్ వర్క్‌షెడ్ వంటి పథకాలను ఎత్తివేయడం, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.
చేనేత కళాకారుల కోసం ప్రత్యేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని, గతంలో రద్దు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరించాలని కోరారు. ఇప్పటికైనా మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రికి సూచించారు.