అనంతగిరి, ఆగస్టు 07 : గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఎస్ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తో హోటల్స్, టీ, మెడికల్, కూరగాయల దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. మండలంలోని గొండ్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమాజంలో మాదకద్రవ్యాల ప్రభావంపై విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు యువతని, సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని, దీనిని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గంజాయి వినియోగం, సరఫరా చేసేవారి సమాచారం పోలీసులకు తెలుపాలని ఆయన కోరారు.

అనంతగిరిలో పోలీసుల విస్తృత తనిఖీలు