Operation Akhal | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. తాజాగా కుల్గామ్ (Kulgam)లో ఉగ్రవాదుల (terrorists)తో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు (soldiers killed). మరో ఇద్దరు గాయపడ్డారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పలు ఆపరేషన్లు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ కశ్మీర్ (south Kashmir) జిల్లాలోని అఖల్ (Akhal) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో ఆగస్టు 1న ఆపరేషన్ అఖల్ (Operation Akhal) పేరుతో కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్ శనివారం తొమ్మిదో రోజుకు చేరుకుంది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన సైనికులను లాన్స్ నాయక్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్‌గా గుర్తించారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల మృతికి సంతాపం తెలియజేసింది. కాగా, ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటి వరకూ ఐదుగురికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 10 మంది గాయపడ్డారు.
Also Read..
Delhi | ఢిల్లీలో దంచికొడుతున్న వాన.. వందకు పైగా విమానాలు ఆలస్యం