US Tariff | ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి జరిగింది. ఆ తర్వాత భారత సైన్యం 6-7 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేసింది. ఆ తర్వాత రెండుదేశాల మధ్య నాలుగైదు రోజుల పాటు హింసాత్మక ఘర్షణ కొనసాగింది. మే 10 సాయంత్రం భారతదేశం-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అయితే, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంలో తన పాత్ర ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈ వాదనలు భారత్ తిరస్కరించింది. భారత్-పాక్ మధ్య ఘర్షణను తగ్గించడం తన ఘనతేనని ఇప్పటి వరకు ఆయన 30 సార్లకుపైగానే చెప్పుకున్నారు. ఈ వాదనలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘర్షణ తగ్గడానికి కారణం డీజీఎంవో స్థాయిలో జరిగిన ప్రత్యక్ష చర్చలేనని.. ఇందులో ఏ మూడో దేశం పాత్ర లేదని భారత్ స్పష్టం చేసింది.
అయితే, జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ జరిగినట్లు ఓ అమెరికన్ మీడియా నివేదిక పేర్కొంది. ఈ సందర్భంలో పాక్ విషయంలో భారత్ ఏ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ట్రంప్‌కు మోదీ స్పష్టం చేశారు. ట్రంప్ కెనడా నుంచి అమెరికాకు తిరిగి వచ్చి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్ హౌస్‌లో భోజనానికి ఆహ్వానించారు. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. ప్రధాని ఫోన్ కాల్ తర్వాత అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయింది. ట్రంప్ భారత్‌పై బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఈ వారంలో భారత్ ఎగుమతులపై 50శాతం సుంకాలను ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయితే, అమెరికా సుంకాలను భారత్ తీవ్రంగా ఖండించింది. సుంకాలు అన్యాయమని పేర్కొంది. ట్రంప్ సుంకాలపై ఇప్పుడే ఏమాత్రం తొందరపడకుండా ప్రతీకారం తీర్చుకోకూడదని భారతం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగంలో కొన్ని రాయితీలు ఇచ్చి ప్రభుత్వం రాజీకి ప్రయత్నించే అవకాశాలున్నాయి. అయితే రష్యాతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశాన్ని సైతం భారత్ పరిశీలిస్తున్నది.
అదే సమయంలో భారత్ చైనాతో దౌత్య సంబంధాలను పెంచుకోవాలని భావిస్తున్నది. ట్రంప్ సుంకాల విధాన కారణంగా రష్యా, చైనా దేశాలకు భారత్‌ను దగ్గరగా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెలలో చైనా దేశంలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలువనున్నారు. ఇది మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణలకు సంకేతంగా పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను విధించిన సమయంలో ఆయా దేశాలు విమర్శలు గుప్పించాయి. తాజాగా అగ్రరాజ్యంలోనే ట్రంప్ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సుంకాల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని పలువురు ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా, ట్రంప్ సుంకాలపై వెనక్కి తగ్గడం లేదు. తాను సుంకాలను వెనక్కి తీసుకుంటే అమెరికా మళ్లీ 1929 నాటి ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే, ట్రంప్ విధిస్తున్న సుంకాలను కోర్టులు నిషేధం విధించే అవకాశాలున్నాయని.. ఈ విషయంలో ట్రంప్ భయపడుతున్నట్లుగా నివేదికలు తెలిపాయి.