డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఆగస్టు 5వ తేదీన వచ్చిన జలవిలయం ఇప్పుడు హర్సిల్ ప్రాంతంలో ఓ కొత్త సరస్సు(Harsil Lake)ను సృష్టించింది. ఖీర్ గంగా నది నుంచి కొట్టుకు వచ్చిన బురద, రాళ్లు అంతా కుప్పలా మారాయి. దీంతో హర్సిల్ ప్రాంతంలో భాగీరథి నీళ్ల ప్రవాహానికి బ్రేక్ పడింది. ఆ నదిలోని నీరు ఇప్పుడు హర్సిల్ వద్ద ఓ సరస్సు తరహాలో రూపాంతరం చెందుతోంది. ఈ పరిణామం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
భారీగా వర్షాలు కురవడం వల్ల కూడా కొండల్లోంచి అధిక శాతం నీరు ప్రవాహిస్తోంది. ఖీర్ గంగా నదితో కొట్టుకువచ్చిన శిథిలాల ఆధారంగా భాగీరథి నది నీళ్లు అక్కడే నిలిచిపోతున్నాయి. దీంతో గంగా నది పరివాహక ప్రాంతం ఇప్పుడు ఓ భయానక ప్రాంతంగా మారింది. భాగీరథి నీరు ఆగిపోవడం వల్ల తాత్కాలిక సరస్సు ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆ నీరు నిలవడం వల్ల ..హర్సిల్ నుంచి గంగోత్రికి వెళ్లే హైవే మార్గం మూసుకుపోయింది. ఆ రోడ్డుమీదే ఇప్పుడు సరస్సు ఏర్పడింది.
రోడ్డు సమీపంలో ఉన్న హెలీప్యాడ్ కూడా నీట మునిగింది. భాగీరథి నది నీరు సరస్సులా మారడంతో.. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఖీర్ గంగా నది నుంచి కొట్టుకువచ్చిన బురద, రాళ్లు సుమారు 30 ఫీట్ల మేర ఎత్తు జామైనట్లు గుర్తించారు. దీని వల్లే గంగా నది పరివాహక ప్రాంతంలో తాత్కాలిక సరస్సు ఏర్పడినట్లు చెబుతున్నారు.
శిథిలాలతో ఏర్పడిన డ్యామ్ వల్ల .. గంగా నదిలో నీటి స్థాయి పెరిగినట్లు ఉత్తరాఖండ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పేర్కొన్నది. అదనపు నీరును దారిమళ్లించేందుకు ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు చేపట్టింది. స్థానికులను ఎత్తైన ప్రదేశాలకు తరలించారు.
#WATCH | Uttarkashi, Uttarakhand | A lake has been formed in Harsil following the flash floods due to the cloudburst that occurred on August 5 pic.twitter.com/xjardbbKzd
— ANI (@ANI) August 9, 2025