Cloudburst | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీతోపాటూ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) సంభవించింది. రాంబన్ (Ramban), రియాసి (Reasi) జిల్లాలో మేఘవిస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది. ఈ కుండపోత వర్షానికి వరదలు సంభవించాయి. అనేక చోట్ల కొండచరియలు (Landslide) విరిగిపడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు.
రియాసి జిల్లాలోని మహోరె ప్రాంతంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ఇంట్లోని కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. నజీర్ అహ్మద్ (38), ఆయన భార్య, ఐదుగురు పిల్లలు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు వారి మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశారు.
రాంబన్ జిల్లాలోని రాజ్ఘడ్ విలేజ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఓ పాఠశాలను వరద ముంచెత్తింది. ఈ వరదకు ఐదుగురు కొట్టుకుపోయారు. వీరిలో నలుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతోంది. మరోవైపు గ్రామంలో కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి (Houses Damaged).
మరోవైపు భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్ము వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు పెట్టాలని సూచించారు. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో జమ్ము ప్రాంతంలో దాదాపు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారుల అంచనా. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులే కావడం గమనార్హం.
Also Read..
PM Modi | బుల్లెట్ రైల్లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. VIDEO
Punjab Rains: పంజాబ్‌లో వరదలు.. 23 మంది మృతి, వెయ్యి గ్రామాలు మునక