చండీఘడ్: పంజాబ్‌లో భీకర వర్షాలు(Punjab Rains) కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వరదలు సంభవించాయి. వదరల్లో కనీసం 23 మంది మరణించారు. సుమారు వెయ్యి గ్రామాలు వాననీటిలో మునిగిపోయాయి. వరద ప్రభావిత జిల్లాల నుంచి సుమారు 16వేల మందిని రక్షించారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. నీటి మునిగిన ప్రాంతాలకు రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తోంది. పఠాన్‌కోట్‌లో 8 మంది, హోషియార్‌పూర్‌లో ఏడు, రూప్‌నగర్, బార్నాలాలో మూడేసి మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని రావి, బియాస్, సట్లజ్ నదులు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి.
వరద పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం భవంత్ మాన్ సింగ్ ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. గురుదాస్‌పుర్, పఠాన్‌కోట్, అమృత్సర్, తరన్ తారన్, కపుర్తలా, హోషియాపూర్, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా పట్టణాల్లో ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షించేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్మీ, బీఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. రావి నది నుంచి సుమారు 14.11 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దీంతో డ్యామేజ్ జరిగింది.