‘బాడీ షేమింగ్‌కు గురై తీవ్రమైన మానసిక వ్యధకు లోనైన సందర్భాలు నా జీవితంలో కోకొల్లలు’ అని బాలీవుడ్ భామ మృణాళ్ఠాకూర్ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన శరీర బరువుపై ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి మాట్లాడారు. ‘ఆ రోజులింకా నా కళ్లలో కదులుతూనే ఉన్నాయి. ఏడ్చీ ఏడ్చీ అలసిపోయి నిద్రపోయేదాన్ని. పొద్దున్నే లేచేసరికి కళ్లు ఉబ్బిపోయి ఉండేవి. నేను అప్పట్లో కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దాంతో నా చుట్టూ ఉండేవారే నన్ను ట్రోల్ చేసేవారు. ఆ ట్రోలింగ్ ప్రభావంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేదాన్ని. అలాంటి సమయంలో అక్షయ్‌కుమార్ మాటలు నాలో మార్పుని తెచ్చాయి.
‘ట్రోలింగ్ వినకుండా ముందుకు సాగాలి. పాత్ర కోసం సన్నగా మారాల్సివస్తే కచ్ఛితంగా మారాలి’ అని ఆయన చెప్పిన ఆ మాటలు నాపై బలంగా పనిచేశాయి. అప్పట్నుంచీ నా శరీరాకృతి గురించి ఆందోళన చెందడం మానేశాను. ఓ రోజు జిమ్‌కు వెళ్లినప్పుడు అక్కడ సన్నగా నాజూగ్గా ఉండే అమ్మాయిలు నా దగ్గరకొచ్చి ‘మీలా మేమూ మారాలంటే ఏం చేయాలి?’ అని అడిగారు. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతామని అప్పుడర్థమైంది. ముందు మనల్ని మనం గౌరవించుకుంటే. ఆటోమేటిగ్గా ఎదుటివారు మనల్ని గౌరవిస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది మృణాళ్ఠాకూర్.