హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.802.92 కోట్లు అవసరమంటూ నిపుణుల కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అందజేశారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్లో 74.56 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని చెప్పారు.
వీటిలో 45 లక్షల ఎకరాల్లో పత్తి, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాల్లో, వరి 14.92 లక్షల ఎకరాల్లో సాగు అయినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు 75 నుంచి 90 శాతం సబ్సిడీతో డ్రిప్, మల్చింగ్, స్ప్రింక్లర్లు అందించాలని సిఫార్సు చేసినట్టు చెప్పారు. ఇందుకు గాను డ్రిప్‌నకు రూ.402 కోట్లు, మల్చింగ్ షీట్లకు రూ.80 లక్షలు, స్ప్రింక్లర్లకు రూ.50 కోట్లు అవసరమని చెప్పారు. విత్తనాలను 75 శాతం సబ్సిడీపై అందజేయాలని, ఇందుకోసం రూ.330 కోట్లు అవసరమని సూచించినట్టు తెలిపారు.