Cognizant : భారత మూలాలున్న ప్రముఖ టెక్ దిగ్గజం, అమెరికా (USA) లో లిస్ట్ అయిన కాగ్నిజెంట్ (Cognizent) కు అక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా మోసం ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కొత్తగా గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ (Green Card Sponsership) ల కోసం దరఖాస్తు చేయకుండా కంపెనీపై యునైటెడ్ స్టేట్స్ కార్మిక శాఖ నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో అధికారికంగా ప్రకటించారు.
కాగ్నిజెంట్‌తో పాటు మరో టెక్నాలజీ సంస్థ క్లౌడెరా పైనా ఇదే తరహా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రకారం కాగ్నిజెంట్ కొత్తగా పీఈఆర్ఎం (ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్) ఫైలింగ్స్ చేసేందుకు వీలుండదు. విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం స్పాన్సర్ చేయాలనుకునే కంపెనీలు తప్పనిసరిగా కార్మిక శాఖ నుంచి ఈ లేబర్ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపైనే ఇప్పుడు సస్పెన్షన్ విధించడం గమనార్హం.
ఈ పరిణామం కాగ్నిజెంట్‌పై ఆధారపడిన వేలాది మంది భారతీయ టెక్ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. 1994లో చెన్నైలో ప్రారంభమై, ప్రస్తుతం అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన కాగ్నిజెంట్, హెచ్-1బీ వీసాలను అత్యధికంగా వినియోగించుకునే సంస్థల్లో ఒకటి. 2026 ఆర్థిక సంవత్సరానికిగానూ ఈ కంపెనీకి 3,510 హెచ్-1బీ వీసా పిటిషన్లు ఆమోదం పొందాయి. అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాత ఆరో స్థానంలో కాగ్నిజెంట్ ఉంది. తాజా సస్పెన్షన్ నేరుగా హెచ్-1బీ వీసాలపై ప్రభావం చూపనప్పటికీ, కంపెనీపై కార్మిక శాఖ దర్యాప్తు చేస్తుండటం ఆందోళనలను పెంచుతోంది.
వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సస్పెన్షన్ వేటు పడింది. “అమెరికన్ కార్మికులకు ఎదురయ్యే ముప్పును ఎంతమాత్రం సహించబోం” అని ఇన్స్పెక్టర్ జనరల్ డి’ఎస్పోసిటో తీవ్రంగా హెచ్చరించారు. కొద్ది నెలల క్రితమే ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో కాగ్నిజెంట్‌పై చర్యలుంటాయని పరోక్షంగా సూచించారు. కంపెనీ వీసా దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. “వేచి చూడండి” అని పోస్ట్ చేశారు. కొంతమంది విజిల్ బ్లోయర్లు కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీల వీసా వినియోగంపై కీలక సమాచారం అందించారని, వారి ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని డి’ఎస్పోసిటో గతంలో ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అమెరికా ప్రభుత్వం వీసా మోసాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ దర్యాప్తు ప్రాధాన్యం సంతరించుకుంది. పీఈఆర్ఎం అనేది విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయడానికి ఒక అమెరికన్ కంపెనీ చేపట్టే మొదటి దశ. ఈ ప్రక్రియలో ప్రతిపాదిత ఉద్యోగానికి తగిన అర్హతలున్న అమెరికన్ కార్మికులు అందుబాటులో లేరని కంపెనీ నిరూపించుకోవాలి. అలాగే విదేశీ ఉద్యోగిని నియమించడంవల్ల స్థానిక కార్మికుల వేతనాలు లేదా పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడదని స్పష్టం చేయాలి. కార్మిక శాఖ నిర్దేశించిన కనీస వేతనాన్ని చెల్లించడానికి అంగీకరించి, స్థానికంగా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ తొలి అడుగు వేయకుండానే కాగ్నిజెంట్‌ను నిలిపివేయడం కంపెనీకి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది.