Udaya Bhanu | ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఉదయభాను.. ఆ తర్వాత నటిగానూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు మరో కొత్త అడుగు వేశారు. తనకంటూ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ తన 15 ఏళ్ల కలకు ప్రతిరూపమని చెప్పిన ఉదయభాను.. తాజాగా జరిగిన ప్రివ్యూ కార్యక్రమంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ నివాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆరు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
విడుదలకు ముందు నిర్వహించిన ప్రివ్యూ కార్యక్రమంలో ఉదయభాను తన సినీ ప్రయాణం, నిర్మాతగా మారాలన్న తన కల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.ఉదయభాను మాట్లాడుతూ.. ‘పంచనామా’ను ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం వెనుక టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తన బిడ్డ కోసం ఎంతగా తాపత్రయపడతానో.. ఈ ప్రాజెక్ట్ కోసం కూడా అంతే స్థాయిలో ప్రతి ఒక్కరూ శ్రమించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన మొత్తం బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 15 ఏళ్లుగా నిర్మాణ సంస్థను ప్రారంభించాలన్న కలతో ప్రయత్నిస్తున్నట్లు ఉదయభాను వెల్లడించారు. ముఖ్యంగా టెలివిజన్‌తోనే తన నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించాలని అనుకున్నానని చెప్పారు. “టెలివిజన్‌లోనే పుట్టాను.. ఉదయభాను హృదయభానుగా మారింది” అంటూ తన బుల్లితెర ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇన్నేళ్లుగా ఎన్నో కథలు, భావనలు తీసుకెళ్లినా అవి కార్యరూపం దాల్చలేదని చెప్పారు. ప్రాజెక్టులు వచ్చే నెల, వచ్చే వారం మొదలవుతాయని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని.. కానీ అవి ఎందుకు ముందుకు వెళ్లలేదో ఇప్పటికీ తనకు ప్రశ్నగానే మిగిలిపోయిందని భావోద్వేగానికి గురయ్యారు. తాను గతంలో ‘డీ ఓ ప్రసాదరావు’ చేసిన సమయంలో జీ5తో కలిసి పనిచేయాలనే ఆలోచన వచ్చిందని ఉదయభాను తెలిపారు. తన స్నేహితుడు శ్రీరామ్ సహాయంతో జీ5కు చెందిన అనురాధను కలిశానని చెప్పారు. తన దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ ఆమెకు వివరించానని.. వాటిలో ప్రతి కథ ఆమెకు నచ్చిందని వెల్లడించారు.తనలో ఉన్న తపనను గమనించిన అనురాధ ఈ ప్రాజెక్ట్‌ను తనకు ఇచ్చారని ఉదయభాను తెలిపారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడ్డామని, రోజుకు రెండు గంటలు కూడా సరిగ్గా నిద్రపోకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
తన కలకు ప్రాణం పోసిన వ్యక్తిగా అనురాధను అభివర్ణిస్తూ ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్మాణ సంస్థ భవిష్యత్తులో ఎంత పెద్దదిగా ఎదిగినా.. తను జీవితాంతం ఆమె పేరును గుండెల్లో ఉంచుకుంటానని ఉదయభాను చెప్పడం కార్యక్రమంలో భావోద్వేగాన్ని నింపింది. జీవితంలో ఎన్నోసార్లు కిందపడినా ప్రతిసారీ తిరిగి లేచి నిలబడ్డానని.. ఇప్పుడు పరుగెత్తడం కూడా నేర్చుకున్నానని ఆమె అన్నారు. అంతేకాకుండా తనతో పాటు మరో నలుగురిని కూడా నిలబెట్టాలనేది తన లక్ష్యమని తెలిపారు. తాను ఎదుర్కొన్న కష్టాలే ఇప్పుడు ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనకు కారణమయ్యాయని ఉదయభాను చెప్పారు.ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే తన నిర్మాణ సంస్థ ప్రధాన ఉద్దేశమని ఉదయభాను స్పష్టం చేశారు. ఎవరికి టాలెంట్ ఉన్నా.. ఏ తలుపు మూసుకుపోయినా ‘ఉదయభాను ప్రొడక్షన్స్ ఉంది’ అనే నమ్మకం ఉండాలని అన్నారు.